విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలను పెంపొందించేందుకు ఉపాధ్యాయులు

Spread the love

విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలను పెంపొందించేందుకు ఉపాధ్యాయులు ఆధునిక బోధనా విధానాలను అవలంబిస్తూ నాణ్యమైన విద్య అందించాలీ….

— జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష….

పెద్దపల్లి//జిల్లా ప్రతినిథి:పెద్దపల్లి, జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న మూడురోజుల భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుల సమగ్ర సేవాకాల శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ సందర్శించారు. అంతర్గాం, పాలకుర్తి, శ్రీరాంపూర్, ఓదెల, పెద్దపల్లి మండలాలకు చెందిన భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులతో సమావేశమై పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఉపాధ్యాయుడు తన బోధనా నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరుచుకుంటూ, ప్రతి విద్యార్థి నిర్దేశిత అభ్యసన ఫలితాలను సాధించేలా కృషి చేయాలని సూచించారు.

చదవడం, రాయడం, విమర్శనాత్మక ఆలోచన, సమస్యల పరిష్కార సామర్థ్యం, సమర్థవంతమైన సంభాషణ వంటి 21వ శతాబ్దానికి అవసరమైన నైపుణ్యాలను విద్యార్థుల్లో పెంపొందించేలా బోధన కొనసాగించాలని పేర్కొన్నారు.

అభ్యసనలో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ప్రత్యేక తరగతుల ద్వారా అవసరమైన విద్యా సహాయం అందించాలని, ప్రతి విద్యార్థి అన్ని అంశాల్లో మెరుగైన ప్రతిభ కనబరిచేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు.

శిక్షణలో భాగంగా కృత్రిమ మేధస్సు ఆధారిత బోధనా విధానాలు, సమాచార సాంకేతికత వినియోగం, డిజిటల్ విద్యా వేదికల వినియోగంపై ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు. పాఠ్య ప్రణాళిక రూపకల్పన, ప్రశ్నాపత్రాల తయారీ, సాంకేతికతతో కూడిన సమర్థవంతమైన బోధనపై రిసోర్స్ పర్సన్లు శిక్షణ అందించారు.

బొమ్మలు, ఆటల ఆధారిత బోధన, ప్రయోగాత్మక విద్య, ప్రభుత్వం అందించే వర్క్‌బుక్‌ల సమర్థ వినియోగం ద్వారా విద్యార్థుల్లో అభ్యసన నైపుణ్యాలు మరింత మెరుగుపడతాయని కలెక్టర్ తెలిపారు.

శిక్షణలో నేర్చుకున్న అంశాలను పాఠశాలల్లో సమర్థవంతంగా అమలు చేసి విద్యార్థులను ఉత్తమ ఫలితాల దిశగా నడిపించాలని ఉపాధ్యాయులకు సూచించారు.

అనంతరం పాఠశాలలోని డిజిటల్ తరగతి గదులు, ప్రాథమిక తరగతులు, భోజనశాల తదితర సౌకర్యాలను కలెక్టర్ పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారులు, రిసోర్స్ పర్సన్లు, శిక్షణ నిర్వాహకులు, వివిధ మండలాలకు చెందిన భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top