వెంకటాపూర్‌లో ఉచిత వైద్య శిబిరం….

TEJA NEWS

వెంకటాపూర్‌లో ఉచిత వైద్య శిబిరం….

మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సీపీ అంబర్ కిషోర్ ఝా పిలుపు…

పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: మంచిర్యాల, రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని దేవాపూర్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమంలో భాగంగా కాసిపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. మెడీలైఫ్ హాస్పిటల్, సన్‌రైజ్ హాస్పిటల్, మంచిర్యాల వైద్యుల సహకారంతో నిర్వహించిన ఈ శిబిరానికి రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా గ్రామ మహిళలు సీపీ అంబర్ కిషోర్ ఝా, మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్‌లకు తిలకం దిద్ది, తలపాగా చుట్టి, పూలమాలలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం గిరిజన సంప్రదాయ నృత్యాలు, వాయిద్యాల నడుమ వారిని కార్యక్రమ వేదికకు తీసుకువచ్చారు.

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో విద్య, వైద్యం, రవాణా వంటి మౌలిక సదుపాయాలు మెరుగుపడడం సంతోషకరమన్నారు. గ్రామాల్లో ప్రజలు ఐకమత్యంతో జీవిస్తూ అభివృద్ధి దిశగా పయనించాలని సూచించారు. మహిళా సంఘాలు స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా బలోపేతం కావడం అభినందనీయమన్నారు.

యువతతో పాటు కుటుంబ సభ్యులెవరూ మత్తు పదార్థాలకు బానిస కాకుండా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సీపీ సూచించారు. మత్తు పదార్థాలు వ్యక్తిని, కుటుంబాన్ని, సమాజాన్ని నాశనం చేస్తాయని హెచ్చరించారు. అలాగే ప్రతి ఒక్కరూ రహదారి భద్రతా నిబంధనలు పాటించాలని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారే వాహనాలు నడపాలని, మైనర్‌లకు వాహనాలు ఇవ్వవద్దని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని సూచించారు.

ఉచిత వైద్య శిబిరంలో జనరల్ ఫిజీషియన్, పల్మనాలజీ, గైనకాలజీ, ఆర్థోపెడిక్స్, జనరల్ సర్జరీ, రేడియాలజీ, కంటి వైద్యం విభాగాలకు చెందిన నిపుణులైన వైద్యులు సేవలందించారు. బీపీ, రక్తంలో చక్కెర పరీక్షలు, ఈసీజీ, ఊపిరితిత్తుల పనితీరు పరీక్షలు, 2డీ ఎకో, అల్ట్రాసౌండ్, కంటి పరీక్షలు ఉచితంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్, బెల్లంపల్లి ఏసీపీ కిరణ్‌కుమార్, సీఐ పి. రమేష్, దేవాపూర్ ఎస్‌ఐ గంగారం, కాసిపేట ఎస్‌ఐ ఆంజనేయులు, మందమర్రి ఎస్‌ఐ నరేష్, రామకృష్ణాపూర్ ఎస్‌ఐ శ్రీధర్, మెడీలైఫ్, సన్‌రైజ్ హాస్పిటల్స్‌కు చెందిన వైద్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువత, విద్యార్థులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top