
రీ-సర్వేతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం….
రైతులు పూర్తి సహకారం అందించాలి….
— కలెక్టర్ కోయ శ్రీహర్ష…
పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి:
భూ భారతి కింద చేపడుతున్న రీ-సర్వే ప్రక్రియను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించి భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. పెద్దపల్లి మండలం సబ్బితం గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన భూ భారతి–రీ-సర్వే అవగాహన గ్రామసభలో ఆయన పాల్గొని ప్రజలకు రీ-సర్వే ప్రక్రియపై వివరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ భారతి పోర్టల్ ద్వారా ఇప్పటికే అనేక భూ సమస్యలు పరిష్కారమయ్యాయని తెలిపారు. భూముల విస్తీర్ణంలో తేడాలు, సరిహద్దు వివాదాలు వంటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రీ-సర్వే చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
రాష్ట్రంలో చివరిసారిగా 1937లో భూ సర్వే జరిగిందని, ప్రస్తుతం అన్ని గ్రామాల్లో సమగ్ర రీ-సర్వే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. పెద్దపల్లి జిల్లాలోని 190 రెవెన్యూ గ్రామాల్లో తొలి దశలో 70 గ్రామాలను ఎంపిక చేయగా, సబ్బితం గ్రామం కూడా వాటిలో ఒకటని తెలిపారు.
రీ-సర్వేలో భాగంగా ముందుగా గ్రామ సరిహద్దులను నిర్ధారించి, అనంతరం ఇళ్లు, ప్రభుత్వ ఆస్తులు, వ్యవసాయ భూములను అత్యాధునిక యంత్రాల సహాయంతో ఖచ్చితంగా సర్వే చేస్తామని చెప్పారు. సర్వే పూర్తైన తర్వాత భూ వివరాలను గ్రామాల్లో ప్రకటించి, ప్రజల అభ్యంతరాల స్వీకరణకు 21 రోజుల గడువు కల్పిస్తామని తెలిపారు. అనంతరం అభ్యంతరాలను పరిష్కరించి, వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసి భూధార్ కార్డులు జారీ చేస్తామని వెల్లడించారు.
పైలట్ ప్రాజెక్టుగా రాష్ట్రంలోని ఐదు గ్రామాల్లో నిర్వహించిన రీ-సర్వే ద్వారా 99 శాతం భూ సమస్యలు పరిష్కారమయ్యాయని కలెక్టర్ తెలిపారు. రోజుకు 40 నుంచి 50 ఎకరాల వరకు సర్వే నిర్వహిస్తామని, ఏ భూములను సర్వే చేయనున్నారనే సమాచారాన్ని ముందుగానే రైతులకు అందజేస్తామని చెప్పారు. రైతులు నిర్దేశిత సమయంలో తమ భూముల వద్ద అందుబాటులో ఉండి అధికారులకు పూర్తి సహకారం అందించాలని కోరారు.
రీ-సర్వే ద్వారా రూపొందే భూ వివరాలు రాబోయే 60 నుంచి 70 సంవత్సరాల వరకు ఉపయోగపడతాయని, ఆధార్ తరహాలో భూధార్ కార్డుల జారీకి ఈ ప్రక్రియ కీలకమని కలెక్టర్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాజయ్య, సర్పంచ్ నూనె సరోజన, సర్వేయర్లు, రెవెన్యూ అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
