
మాట నిలబెట్టుకో కేటీఆర్.. రాజకీయ సన్యాసం తీసుకుంటావా…? ప్రజలకు క్షమాపణ చెబుతావా…?
70,664 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీతో కాంగ్రెస్ హామీని నిలబెట్టుకుంది – ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్
పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: రామగుండం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే 70,664 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసి చరిత్ర సృష్టించిందని, ఈ నేపథ్యంలో మాజీ మంత్రి కేటీఆర్ తన మాటకు కట్టుబడి రాజకీయ సన్యాసం తీసుకోవాలని లేదా తెలంగాణ ప్రజలకు, నిరుద్యోగ యువతకు బహిరంగ క్షమాపణ చెప్పాలని రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ సవాల్ విసిరారు.
రామగుండంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, “70 వేల ఉద్యోగాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేదని, ఇచ్చినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని కేటీఆర్ ప్రకటించారు. ఇప్పుడు అధికారికంగా 70,664 ఉద్యోగాలు భర్తీ అయ్యాయి. ఇక కేటీఆర్ తన మాట నిలబెట్టుకోవాల్సిన సమయం వచ్చింది” అని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోందని, పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు చేపట్టి వేలాది మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించిందని పేర్కొన్నారు. త్వరలోనే రిజర్వేషన్ నిబంధనలకు అనుగుణంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి మరిన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలిపారు.
బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో కుమ్మక్కై కాంగ్రెస్ ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తోందని విమర్శించిన ఎమ్మెల్యే, ప్రజలను మభ్యపెట్టే రాజకీయాలు తెలంగాణలో ఇక సాగవని అన్నారు. ప్రజలు వాస్తవాలను గమనిస్తున్నారని, అభివృద్ధి, సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో రామగుండం మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, కార్పొరేటర్లు, సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
