
స్నేహపూర్వక పోలీసింగ్‌తో ప్రజల విశ్వాసం పెంచాలి…
నాణ్యమైన దర్యాప్తుకు ప్రాధాన్యం ఇవ్వాలి: డీసీపీ బి. రామ్ రెడ్డి….
పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: సుల్తానాబాద్, రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి జోన్ సుల్తానాబాద్ సర్కిల్ కార్యాలయాన్ని వార్షిక తనిఖీల్లో భాగంగా పెద్దపల్లి డీసీపీ బి. రామ్ రెడ్డి, ఐపీఎస్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సర్కిల్ కార్యాలయానికి చేరుకున్న డీసీపీ పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించారు.
తనిఖీల సందర్భంగా సర్కిల్ పరిధిలో నమోదైన గ్రేవ్ కేసులు, దర్యాప్తులో ఉన్న కేసుల సీడీ ఫైళ్లు, పెండింగ్ ట్రయల్ కేసులను పరిశీలించారు. ముఖ్యంగా పోక్సో కేసుల్లో నిందితులకు శిక్షలు పడేలా నాణ్యమైన, వేగవంతమైన దర్యాప్తు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
సర్కిల్ పరిధిలోని పోలీస్ స్టేషన్లను తరచూ తనిఖీ చేస్తూ సిబ్బంది పనితీరును నిరంతరం పర్యవేక్షించాలని సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌కు సూచించారు. రౌడీషీటర్లు, హిస్టరీషీటర్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనించాలని, ప్రతి నెల వారికి సంబంధించిన తాజా సమాచారాన్ని సేకరించి నమోదు చేయాలని ఆదేశించారు.
పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుని గౌరవంగా స్వాగతించి, వారి సమస్యలను ఓర్పుతో విని వెంటనే స్పందించేలా సిబ్బంది వ్యవహరించాలని సూచించారు. ప్రజలకు స్నేహపూర్వక పోలీసింగ్ అందించడంలో ప్రతి అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, క్రమశిక్షణ, పారదర్శకతతో సేవలు అందించడం ద్వారా పోలీస్ శాఖపై ప్రజల్లో విశ్వాసం మరింత పెరగాలని పేర్కొన్నారు.
కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా సైబర్ నేరాలు, సామాజిక అంశాలు, ట్రాఫిక్ నియమాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అలాగే గ్రామాల్లో సీసీ కెమెరాల ప్రాముఖ్యతను వివరించి, ప్రతి గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటు జరిగేలా ప్రజలను చైతన్యపరచాలని ఆదేశించారు.
అనంతరం డీసీపీ పోలీసు అధికారులతో కలిసి పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఏసీపీ జి. కృష్ణ, సుల్తానాబాద్ సీఐ రంజిత్ రావు, సర్కిల్ పరిధిలోని ఎస్‌ఐలు, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.
సబ్ హెడ్: ప్రజలకు మెరుగైన సేవలే లక్ష్యం… కమ్యూనిటీ పోలీసింగ్, సైబర్ అవగాహనపై అధికారులకు డీసీపీ కీలక ఆదేశాలు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
