
ప్రభుత్వ ఆసుపత్రులే ప్రజలకు భరోసా…
ప్రత్యేక వైద్య సేవలను ప్రతి ఇంటికీ చేరవేయాలి: కలెక్టర్ కోయ శ్రీహర్ష…
పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి:రామగుండం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న ప్రత్యేక వైద్య సేవలను ప్రజలకు చేరువ చేసి, ప్రైవేట్ ఆసుపత్రుల్లో అనవసర ఖర్చు చేయకుండా ప్రభుత్వ వైద్య సేవలను వినియోగించుకునేలా విస్తృత ప్రచారం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష వైద్యాధికారులను ఆదేశించారు.
రామగుండం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్)ను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్, ఆసుపత్రిలో అందుతున్న ప్రత్యేక వైద్య సేవలు, చికిత్సా సౌకర్యాలు, వైద్యుల అందుబాటు, మౌలిక వసతులను పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యాధునిక సౌకర్యాలతో అనేక ప్రత్యేక వైద్య సేవలు అందుబాటులో ఉన్నప్పటికీ వాటిపై ప్రజలకు సరైన అవగాహన లేకపోవడం వల్ల ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించి అధిక ఖర్చు చేస్తున్నారని అన్నారు. ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో లభిస్తున్న సేవలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు.
ప్రతి ప్రత్యేక వైద్య విభాగానికి సంబంధించిన సేవలు, వైద్యుల అందుబాటు రోజులు, చికిత్సల వివరాలను ఆసుపత్రి ఆవరణలో స్పష్టంగా ప్రదర్శించడంతో పాటు గ్రామాలు, పట్టణాల్లో ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో విశ్వాసం పెరిగేలా నాణ్యమైన సేవలు అందించాలని పేర్కొన్నారు.
తనిఖీలో భాగంగా కలెక్టర్ న్యూరో సర్జరీ, ఫిజియోథెరపీ, 2డీ ఎకో, అడిక్షన్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ (ఏటీఎఫ్), పీడియాట్రిక్ సర్జరీ, యూరాలజీ, న్యూరో ఫిజీషియన్ విభాగాలను సందర్శించి అక్కడ అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. రోగులతో మాట్లాడి చికిత్సా విధానం, సేవల నాణ్యతపై ఆరా తీశారు. ప్రతి విభాగంలో నాణ్యమైన వైద్య సేవలు నిరంతరంగా అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
ప్రభుత్వ ఆసుపత్రులు ప్రజల ఆరోగ్య భద్రతకు ప్రధాన కేంద్రాలుగా నిలవాలని, అందుబాటులో ఉన్న అన్ని ప్రత్యేక వైద్య సేవలను ప్రజలు పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా విస్తృత ప్రచారం చేపట్టాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు.
ఈ తనిఖీలో మెడికల్ కాలేజ్ సూపరింటెండెంట్ డా. హిమబిందు సింగ్, సీఎస్ఆర్ ఎంఓ డా. కృపాబాయి, డా. అప్పారావు, ఇతర వైద్యులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.