
అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు జాబితాలో ఉండేలా అప్రమత్తంగా పనిచేయాలి….
–ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణరావు…
పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: పెద్దపల్లి, రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను అత్యంత బాధ్యతగా తీసుకుని, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా కృషి చేయాలని ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణరావు అన్నారు.
పెద్దపల్లి పట్టణ మున్సిపల్ చైర్మన్, ఉపాధ్యక్షుడు, కౌన్సిలర్లతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ప్రజాప్రతినిధి, ప్రతి కార్యకర్త తమ పరిధిలోని ఓటర్లకు ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. ఇంటింటికీ వచ్చే బూత్ స్థాయి అధికారులకు ప్రజలు సహకరించి, తమ పేరు, చిరునామా, కుటుంబ వివరాలు తదితర సమాచారాన్ని సరిచూసుకుని అవసరమైన వివరాలు అందించాలని కోరారు.
పట్టణంలోని ప్రతి వార్డులో ప్రజలకు ముందస్తుగా అవగాహన కల్పించి, అర్హులైన ఎవరి పేరు కూడా ఓటరు జాబితా నుంచి తొలగిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే కాకుండా ఎప్పటికప్పుడు ఓటరు జాబితాపై దృష్టి సారించాలని కార్యకర్తలకు సూచించారు.
ప్రజల విశ్వాసాన్ని పొందలేని కొందరు ఓటరు జాబితాల్లో గందరగోళం సృష్టించి రాజకీయ ప్రయోజనాలు పొందేందుకు ప్రయత్నించిన ఘటనలు దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు. అలాంటి ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలకు తెలంగాణలో అవకాశం ఇవ్వకుండా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, బూత్ స్థాయి ప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.
అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు జాబితాలో ఉండేలా ప్రజలకు అవసరమైన సహాయసహకారాలు అందించాలని ఆయన సూచించారు.
ఈ సమావేశంలో పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్, ఉపాధ్యక్షుడు, పట్టణ కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.