
సూర్యాపేటలో యూరియా బస్తాల విక్రయంలో అక్రమాలు..?
రైతుల నుంచి అధిక ధర వసూలు చేస్తున్న ఫెర్టిలైజర్ షాపు!
సూర్యాపేట,
సూర్యాపేట జిల్లా కేంద్రంలో యూరియా విక్రయాల పేరుతో రైతుల నుంచి అధిక ధరలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఖమ్మం రోడ్డులో భారత్ పెట్రోల్ బంక్ సమీపంలోని హాకా సర్వీస్ సెంటర్ (ఫర్టిలైజర్స్, సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్) లో 45 కిలోల యూరియా బస్తాపై ముద్రించిన ధర రూ.266.50 కాగా, రైతుల నుంచి రూ.300 వసూలు చేస్తున్నారని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై నిర్వాహకులను ప్రశ్నించగా, “మా వద్ద మాత్రమే కాదు… అందరూ ఇలాగే తీసుకుంటున్నారు” అంటూ సమాధానం చెబుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా, ఫోన్‌పే, గూగుల్ పే, యూపీఐ ద్వారా చెల్లింపు చేయాలని కోరినా, “మా వద్ద ఆ సదుపాయం లేదు… నగదు రూపంలోనే రూ.300 చెల్లించాలి” అని చెప్పడంతో రైతులు బ్యాంకులు, ఏటీఎంలకు వెళ్లి నగదు తీసుకువచ్చి చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని తెలిపారు. మరోవైపు, రైతులు రూ.300 చెల్లించినప్పటికీ రసీదులో మాత్రం అసలు ధర రూ.266.50 మాత్రమే నమోదు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అదనంగా తీసుకున్న మొత్తానికి ఎలాంటి రశీదు ఇవ్వడం లేదని రైతులు చెబుతున్నారు.
దీనివల్ల ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ రైతులను ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. యాప్ ద్వారా యూరియా విక్రయాలు నిర్వహిస్తున్నప్పుడు, డిజిటల్ చెల్లింపులు స్వీకరించకపోవడం వెనుక ఉద్దేశం ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. నగదు చెల్లింపులకే పరిమితం చేయడం అనుమానాలకు తావిస్తోందని వారు పేర్కొంటున్నారు. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్, జిల్లా వ్యవసాయ అధికారి, ఎరువుల తనిఖీ అధికారులు, లీగల్ మెట్రాలజీ శాఖ మరియు సంబంధిత అధికారులు తక్షణమే దర్యాప్తు నిర్వహించి వాస్తవాలను వెలికి తీయాలని, నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.