శాంతిభద్రతలే లక్ష్యం – బహిరంగ మద్యం సేవనం, అనుమతి లేని డీజేలు, డ్రోన్లపై నిషేధం కొనసాగింపు

Spread the love

శాంతిభద్రతలే లక్ష్యం – బహిరంగ మద్యం సేవనం, అనుమతి లేని డీజేలు, డ్రోన్లపై నిషేధం కొనసాగింపు…

— పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా…

పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: రామగుండం, : సాధారణ ప్రజలు, ముఖ్యంగా మహిళల భద్రత, ప్రజా శాంతి భద్రతల పరిరక్షణ కోసం రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జోన్‌లలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవనంపై అమల్లో ఉన్న నిషేధాజ్ఞలను కొనసాగిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. అలాగే అనుమతి లేని డీజే సౌండ్ సిస్టమ్‌లు, డ్రోన్ల వినియోగంపై కూడా నిషేధాజ్ఞలను పొడిగించినట్లు వెల్లడించారు.

విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మద్యం మత్తులో అసభ్యంగా ప్రవర్తించడం వల్ల ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని పేర్కొన్నారు.

ఈ నిషేధాజ్ఞలు 2026 ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 1 వరకు అమల్లో ఉంటాయని, పరిస్థితులను బట్టి కాలపరిమితిని పొడిగించే అవకాశం ఉందని తెలిపారు. భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) సెక్షన్ 223, హైదరాబాద్ నగర పోలీస్ చట్టం, 1348 ఫసలీ నిబంధనల ప్రకారం ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

డీజే సౌండ్ సిస్టమ్‌ల అధిక శబ్దం వల్ల చిన్నపిల్లలు, వృద్ధులు, రోగులు, విద్యార్థులకు ఇబ్బందులు కలుగుతున్న నేపథ్యంలో వాటి వినియోగంపై కూడా నిషేధాన్ని కొనసాగిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమాలకు మైక్ సెట్ ఉపయోగించాల్సి వస్తే సంబంధిత డివిజన్ ఏసీపీ నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని, ప్రభుత్వ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని సూచించారు.

అలాగే రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ చట్టం అమల్లో ఉంటుందని, 2026 ఆగస్టు 1 ఉదయం 6 గంటల నుంచి సెప్టెంబర్ 1 ఉదయం 6 గంటల వరకు ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాలు నిర్వహించాలంటే ముందస్తు పోలీస్ అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేశారు.

బంద్‌ల పేరిట సంస్థలు, కార్యాలయాలను బలవంతంగా మూసివేయించడం, ఇతరులను బెదిరించడం లేదా ఒత్తిడి చేయడం వంటి చర్యలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలందరూ పోలీస్ శాఖకు సహకరించాలని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా విజ్ఞప్తి చేశారు.

You cannot copy content of this page

Scroll to Top