
అర్హులైన వారికి 2బీహెచ్‌కే ఇళ్లు వెంటనే కేటాయించాలి….
సెప్టెంబర్ 5లోగా లబ్ధిదారుల వివరాలను ఎంఐఎస్ పోర్టల్‌లో నమోదు చేయాలి….
— కలెక్టర్ కోయ శ్రీహర్ష….
పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి, : జిల్లాలో నిర్మాణం పూర్తయి ఇంకా కేటాయించని 2బీహెచ్‌కే ఇళ్లను అర్హులైన లబ్ధిదారులకు వెంటనే కేటాయించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. ఓదెల, కాల్వశ్రీరాంపూర్, రామగుండం, మంథని, పెద్దపల్లి ప్రాంతాల్లో నిర్మించిన ఇళ్లను పూర్తిస్థాయిలో లబ్ధిదారులకు అందించేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె. అరుణశ్రీతో కలిసి గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలోని పథకాలపై అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిర్మాణం పూర్తయిన ఇళ్లు ఖాళీగా ఉండకుండా అర్హులైన లబ్ధిదారులను గుర్తించి, క్షేత్రస్థాయిలో పరిశీలన, ధ్రువీకరణ ప్రక్రియలను వేగవంతం చేసి ఇళ్ల కేటాయింపును పూర్తి చేయాలని ఆదేశించారు.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పట్టణ) పథకం కింద కేంద్ర నిధులు పొందేందుకు అవసరమైన లబ్ధిదారుల వివరాలను సెప్టెంబర్ 5, 2026లోగా ఎంఐఎస్ పోర్టల్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించారు. వివరాల నమోదు, సమాచారాన్ని అప్‌లోడ్ చేసే సమయంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.
అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ల రెండో విడతకు అర్హులైన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల ప్రయోజనం అందేలా పారదర్శకంగా ఎంపిక చేయాలని సూచించారు.
గృహ నిర్మాణ శాఖ పథకాల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, నిర్దేశించిన లక్ష్యాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు త్వరితగతిన అందేలా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
సమావేశంలో పీడీ హౌసింగ్ పి. పవన్ కుమార్, గృహ నిర్మాణ శాఖ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
