చేయూత పెన్షన్ దరఖాస్తులకు ఆగస్టు 31 చివరి గడువు….

Spread the love

చేయూత పెన్షన్ దరఖాస్తులకు ఆగస్టు 31 చివరి గడువు….

అర్హులైన ప్రతి ఒక్కరూ వెంటనే దరఖాస్తు చేసుకోవాలి…

— కలెక్టర్ కోయ శ్రీహర్ష….

పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి, : జిల్లాలో చేయూత పెన్షన్ దరఖాస్తుల స్వీకరణ గడువును ఈ నెల 31వ తేదీ వరకు పొడిగించినట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

విడుదల చేసిన ప్రకటనలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు, వార్డు అధికారులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామ సమైక్య సంఘం అధ్యక్షులు, వివోఏలు అర్హులైన వారిని గుర్తించి దరఖాస్తుల స్వీకరణ, ఆన్‌లైన్ నమోదు ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు.

వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, ఫైలేరియా, డయాలసిస్ వ్యాధిగ్రస్తులు తదితర అర్హులైన వారు ఎవరైనా పెన్షన్ పొందేందుకు మిగిలి ఉంటే వెంటనే గుర్తించి వారి దరఖాస్తులను స్వీకరించాలని సూచించారు.

మున్సిపాలిటీల పరిధిలో వార్డు అధికారులు, గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు ఈ ప్రక్రియకు పూర్తి బాధ్యత వహించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఆగస్టు 31 తర్వాత జిల్లా కార్యాలయానికి సంబంధిత వార్డు లేదా గ్రామం నుంచి పెన్షన్ దరఖాస్తులు వస్తే బాధ్యులైన అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

పెన్షన్ ఇప్పిస్తామని చెప్పి ఎవరైనా మధ్యవర్తులు సంప్రదిస్తే వారి మాటలు నమ్మి మోసపోవద్దని కలెక్టర్ సూచించారు. అవసరమైన ధ్రువపత్రాలతో నేరుగా మున్సిపాలిటీలోని వార్డు అధికారికి లేదా గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శికి దరఖాస్తు అందజేయాలని తెలిపారు.

You cannot copy content of this page

Scroll to Top