ఓదెల మల్లికార్జున స్వామి ఆలయానికి మహర్దశ

ఓదెల మల్లికార్జున స్వామి ఆలయానికి మహర్దశ
రూ.15 కోట్లతో ఆలయ పునర్నిర్మాణం.. మరో రూ.8 కోట్లతో అభివృద్ధి పనులు….

భక్తుల కోసం 22 వసతి గృహాల సముదాయానికి భూమిపూజ….

పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి, ఓదెల/ : ప్రముఖ పుణ్యక్షేత్రం ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానాన్ని దశలవారీగా అన్ని విధాలా అభివృద్ధి చేసి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు తెలిపారు.

ఓదెల మల్లికార్జున స్వామి దేవస్థానాన్ని సందర్శించిన విజయరమణ రావు ముందుగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవాదాయ శాఖ స్థపతితో కలిసి ఆలయ ఆవరణలో చేపట్టనున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. దాతల సహకారంతో నిర్మించనున్న భక్తుల 22 వసతి గృహాల సముదాయానికి భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా విజయరమణ రావు మాట్లాడుతూ ఆలయ పరిసరాల్లో ఇప్పటికే రూ.1.30 కోట్లతో రహదారులు, ఇతర అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. ఆలయ పునర్నిర్మాణానికి రూ.15 కోట్లు కేటాయించి పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఆలయానికి నూతన గోపురాలు, రాతి శిల్పాలతో ప్రాకారం నిర్మించి మరింత సుందరంగా తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు. పర్యాటక శాఖ ద్వారా మరో రూ.8 కోట్ల నిధులు మంజూరు కానున్నాయని తెలిపారు.

రానున్న రోజుల్లో ఓదెల మల్లికార్జున స్వామి ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను కల్పించేందుకు కృషి చేస్తామని విజయరమణ రావు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్, సభ్యులు, ఆలయ కార్యనిర్వహణ అధికారి, గ్రామ సర్పంచ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, వివిధ గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top