గోదావరి ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి….

గోదావరి ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి….

సుందిళ్ల బ్యారేజీ నుంచి రామగుండం వరకు 5 కి.మీ. కరకట్ట నిర్మించాలి

తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేసిన మద్దెల దినేష్…

పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి, రామగుండం/ : గోదావరి ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు సుందిళ్ల బ్యారేజీ నుంచి రామగుండం వరకు సుమారు 5 కిలోమీటర్ల మేర కరకట్ట నిర్మించాలని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షుడు మద్దెల దినేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ మేరకు రామగుండం తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారీ వర్షాలు, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నీటి విడుదల కారణంగా గోదావరి నదిలో నీటిమట్టం పెరిగిన ప్రతిసారీ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయని తెలిపారు.

మేడిపల్లి, మల్కాపురం, సప్తగిరి కాలనీ, ఉదయ్‌నగర్, రెడ్డి కాలనీ, ప్రశాంత్‌నగర్, శ్రీనగర్ కాలనీ, గంగానగర్, పవర్‌హౌస్ కాలనీ తదితర ప్రాంతాల ప్రజలు వరదల సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. గోదావరి వంతెన వద్ద నీటిమట్టం పెరగడంతో పలుమార్లు రాకపోకలు సైతం నిలిచిపోతున్నాయని తెలిపారు.

గత పాలకులు ముంపు ప్రాంతాల అభివృద్ధి, వరద నివారణకు కరకట్ట నిర్మిస్తామని పలు సందర్భాల్లో హామీలు ఇచ్చారని, రూ.130 కోట్లు, రూ.200 కోట్లు, రూ.400 కోట్లతో పనులు చేపడతామని ప్రకటించడానికే పరిమితమయ్యారని విమర్శించారు. హామీలు అమలుకు నోచుకోకపోవడం ముంపు ప్రాంత ప్రజల దురదృష్టకరమని అన్నారు.

సుందిళ్ల బ్యారేజీ నుంచి రామగుండం వరకు కరకట్ట నిర్మాణానికి అవసరమైన భూసేకరణ చేపట్టి, సమగ్ర అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని కోరారు. కరకట్ట నిర్మాణంతో ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడంతో పాటు ప్రజల ప్రాణాలు, ఆస్తులకు రక్షణ కలుగుతుందని తెలిపారు. గోదావరి తీర ప్రాంతాన్ని సుందరీకరించి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తే ప్రభుత్వానికి ఆదాయం సమకూరే అవకాశం ఉందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి భూసేకరణ, అంచనాల ప్రక్రియను పూర్తి చేసి 5 కిలోమీటర్ల కరకట్ట నిర్మాణ పనులను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని మద్దెల దినేష్ డిమాండ్ చేశారు.

You cannot copy content of this page

Scroll to Top