విద్యార్థుల హామీలు అమలు చేయకపోతే అసెంబ్లీ ముట్టడిస్తాం….

విద్యార్థుల హామీలు అమలు చేయకపోతే అసెంబ్లీ ముట్టడిస్తాం….

ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకార వేతనాల బకాయిలను వెంటనే విడుదల చేయాలి…

— ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మణికంఠ రెడ్డి…

పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి, గోదావరిఖని/ : రాష్ట్రంలో విద్యారంగ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, ఎన్నికల సమయంలో విద్యార్థులకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే సెప్టెంబర్ 7 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి చేపడతామని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి హెచ్చరించారు.

గోదావరిఖని పట్టణంలోని భాస్కర్‌రావు భవన్‌లో ఏఐఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం జిల్లా అధ్యక్షుడు సాయి ఆజాద్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన మణికంఠ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 34 నెలలు గడుస్తున్నా ఎన్నికల మేనిఫెస్టోలో విద్యార్థులకు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని విమర్శించారు.

విద్యార్థులకు ఇస్తామని ప్రకటించిన స్కూటీలు, ల్యాప్‌టాప్‌లు, రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు హామీలను ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకార వేతనాల బకాయిలు విడుదల కాకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

కళాశాలల్లో ధ్రువపత్రాల కోసం విద్యార్థులే ఫీజులు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.
విద్యారంగానికి బడ్జెట్‌లో కనీసం 15 శాతం నిధులు కేటాయించాలని, పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకార వేతనాల బకాయిలను ఒకేసారి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటం ఆడకుండా విద్యారంగానికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.

ముఖ్యమంత్రి వద్దే విద్యాశాఖ ఉన్నప్పటికీ విద్యార్థుల సమస్యలు పరిష్కారం కావడం లేదని విమర్శించిన ఆయన, విద్యాశాఖకు ప్రత్యేక మంత్రిని నియమించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు ఇచ్చిన హామీలను అమలు చేస్తామని అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు.

ప్రభుత్వం స్పందించి విద్యారంగ సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులను ఏకం చేసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని, అవసరమైతే ఢిల్లీ తరహా ఉద్యమాన్ని తెలంగాణ గల్లీల్లో నిర్వహిస్తామని మణికంఠ రెడ్డి హెచ్చరించారు.

ఈ సమావేశంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి రేణుకుంట్ల ప్రీతం, మామిడిపల్లి హేమంత్, ఎల్కపల్లి సురేష్, లక్ష్మీ ప్రసన్న, తడిగొప్పుల అనూప్ సాయి, అభిషేక్, ఆరే జశ్వంత్, గొడిసెల ప్రణీత్, రాహుల్, సూర్యప్రకాశ్, సాయి, మహి, సాయి శరణ్య తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top