
అధునాతన వంటశాల సరే.. మధ్యాహ్న భోజన కార్మికుల పరిస్థితి ఏమిటి…?
కార్మికుల ఉపాధి భద్రతపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి…
అక్షయ ఫౌండేషన్‌తో రహస్య ఒప్పందం చేసుకున్నారన్న ఆరోపణలు….
ఉపాధికి భంగం కలిగితే ఉద్యమాలు చేపడతాం…
— ఏఐటీయూసీ…
పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి, పెద్దపల్లి/ : ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించే చర్యలను స్వాగతిస్తున్నామని, అయితే అదే పేరుతో మధ్యాహ్న భోజన కార్మికుల ఉపాధికి భంగం కలిగిస్తే సహించేది లేదని ఏఐటీయూసీ పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి సునీల్ స్పష్టం చేశారు.
మంథని మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన అధునాతన వంటశాలలో గంటకు 10 వేల ఇడ్లీలు, 3 వేల దోసెలు తయారు చేసే సాంకేతిక వ్యవస్థను ఏఐటీయూసీ స్వాగతిస్తుందని తెలిపారు. అయితే సాంకేతికత పేరుతో పాఠశాలల్లో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులను ఇంటికి పంపించే ప్రయత్నాలు చేయడం సరికాదన్నారు.
మధ్యాహ్న భోజన కార్మికుల ఉపాధిని దెబ్బతీసే విధంగా ప్రభుత్వం అక్షయ ఫౌండేషన్‌తో రహస్య ఒప్పందం చేసుకున్నట్లు ఆరోపించారు. యంత్రాలు, అధునాతన పరికరాలు రావడంలో తప్పులేదని, కానీ వాటి కారణంగా కార్మికుల పొట్ట కొట్టే పరిస్థితి వస్తే ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు.
స్కీం వర్కర్ల ఉపాధి భద్రతపై ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలని, మధ్యాహ్న భోజన కార్మికులకు ఉద్యోగ భద్రతపై భరోసా కల్పించాలని కడారి సునీల్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే మధ్యాహ్న భోజన కార్మికులను ఏకం చేసి ఐక్య పోరాటాలకు కార్యాచరణ రూపొందిస్తామని, అవసరమైతే దశలవారీగా ఉద్యమాలు చేపడతామని ఆయన స్పష్టం చేశారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
