కోవిడ్‌ సేవలందించిన సిబ్బందికి మళ్లీ అవకాశం కల్పించాలి….

కోవిడ్‌ సేవలందించిన సిబ్బందికి మళ్లీ అవకాశం కల్పించాలి….

సింగరేణి ఆర్జీ-1 ఆసుపత్రిలో కాంట్రాక్ట్ కార్మికులకు రెగ్యులర్ డ్యూటీలు ఇవ్వాలి….

యాజమాన్యానికి తెలంగాణ కాంట్రాక్ట్ కార్మిక సంఘం వినతి…

పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి, గోదావరిఖని/ : కోవిడ్‌ మహమ్మారి సమయంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సింగరేణి కార్మికులు, వారి కుటుంబాలకు వైద్య సేవలు అందించిన ఏఎన్‌ఎంలు, జీఎన్‌ఎం స్టాఫ్‌ నర్సులు, ఆయాలు, వార్డు బాయ్‌లకు సింగరేణి ఆర్జీ-1 ఏరియా ఆసుపత్రిలో తిరిగి అవకాశం కల్పించాలని తెలంగాణ కాంట్రాక్ట్ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మద్దెల శ్రీనివాస్ కోరారు.

ఈ మేరకు ఆర్జీ-1 ఏరియా ఆసుపత్రి ఏసీఎంవో ప్రసన్నకుమార్‌కు సంఘం తరఫున వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మద్దెల శ్రీనివాస్ మాట్లాడుతూ 2020లో కరోనా మహమ్మారి తీవ్రంగా ఉన్న సమయంలో అత్యవసర పరిస్థితుల్లో కాంట్రాక్ట్‌ పద్ధతిలో ఏఎన్‌ఎంలు, జీఎన్‌ఎం స్టాఫ్‌ నర్సులు, ఆయాలు, వార్డు బాయ్‌లుగా విధులు నిర్వహించామని తెలిపారు.

అతి తక్కువ వేతనాలతో 24 గంటలూ మాస్కులు, రక్షణ దుస్తులు ధరించి సింగరేణి కార్మికులు, వారి కుటుంబాలు, అధికారులు, ప్రజలకు సేవలందించామని పేర్కొన్నారు. కరోనా ప్రభావం తగ్గిన అనంతరం ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా తమను విధుల నుంచి తొలగించడం బాధాకరమన్నారు.

గతంలో ఈ సమస్యపై తమ సంఘం ఆధ్వర్యంలో ధర్నాలు, నిరసనలు, వినతిపత్రాలు అందజేశామని తెలిపారు. అప్పట్లో అధికారులు తమ సేవలను అభినందించడంతో పాటు ఇతర ప్రాంతాల్లో తిరిగి అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. అయితే ఆ హామీ పూర్తిస్థాయిలో అమలు కాలేదని అన్నారు.

ప్రస్తుతం ఆర్జీ-1 ఏరియా ఆసుపత్రికి ఇతర సింగరేణి ఏరియాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో రోగులు, వైద్య పరమైన సిఫారసు కేసులు వస్తున్నాయని తెలిపారు. సిబ్బంది కొరత కారణంగా ప్రస్తుతం పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు అదనపు విధులు నిర్వహిస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.

ఆసుపత్రిలో అన్ని విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు రెగ్యులర్ డ్యూటీలు కల్పించాలని, ప్రస్తుతం రొటేషన్ పద్ధతిలో పనిచేస్తున్న వారితో పాటు గతంలో కోవిడ్‌ సమయంలో సేవలందించి తొలగించబడిన సిబ్బందికి ప్రాధాన్యతనిస్తూ తిరిగి అవకాశం కల్పించాలని మద్దెల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. దీనివల్ల ఆసుపత్రి వైద్య సేవలు మరింత మెరుగుపడి రోగులకు సకాలంలో సేవలు అందుతాయని తెలిపారు.

వినతిపత్రం కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది ప్రణయ, శ్రావణ్య, రమ్య, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top