కనీస వేతనాల మండలిలో సీఐటీయూకు ప్రాతినిధ్యం కల్పించాలి

Spread the love

కనీస వేతనాల మండలిలో సీఐటీయూకు ప్రాతినిధ్యం కల్పించాలి

కార్మికుల గొంతు నొక్కే కుట్ర.. సీఐటీయూ ఆగ్రహం!

కనీస వేతనాల సలహా మండలిలో ప్రాతినిధ్యం కల్పించాలంటూ ఎన్టీపీసీ వద్ద నిరసన

రూ.26 వేల కనీస వేతనం ప్రకటించాలి.. పెండింగ్‌ జీవోలు వెంటనే విడుదల చేయాలి…

పెద్దపల్లి- జిల్లా ప్రతినిధి, జ్యోతినగర్// కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్ర కనీస వేతనాల సలహా మండలిలో సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ వంటి కేంద్ర కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించకపోవడాన్ని నిరసిస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం ఎన్టీపీసీ గేట్ నంబర్-2 వద్ద ప్లకార్డులతో నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా రామగుండం ఇండస్ట్రియల్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ప్రధాన కార్యదర్శి గీట్ల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. కార్మికుల సమస్యలను ప్రశ్నించే సీఐటీయూను కనీస వేతనాల సలహా మండలికి దూరంగా ఉంచడం కేంద్ర ప్రభుత్వ దుర్మార్గమైన చర్య అని విమర్శించారు. ఐదు సంవత్సరాలకు ఒకసారి సవరించాల్సిన జీవో-2022 గడువు ముగిసి నాలుగు సంవత్సరాలు దాటినా కనీస వేతనాలను నిర్ణయించకుండా, పెండింగ్‌లో ఉన్న జీవోలను విడుదల చేయకుండా కేంద్ర ప్రభుత్వం కార్మికులకు తీవ్ర నష్టం కలిగిస్తోందని ఆరోపించారు.

కార్మికుల హక్కులను హరించే విధంగా నాలుగు కార్మిక కోడ్‌లను తీసుకువచ్చి, యజమానులు కార్మికుల శ్రమను మరింతగా దోచుకునే పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం కల్పిస్తోందని లక్ష్మారెడ్డి విమర్శించారు.

కేంద్ర కనీస వేతనాల సలహా మండలిలో సీఐటీయూకు ప్రాతినిధ్యం కల్పించాలని, కార్మికులకు కనీస వేతనంగా రూ.26,000 నిర్ణయించాలని, పెండింగ్‌లో ఉన్న జీవోలను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే నాలుగు కార్మిక కోడ్‌లను తక్షణమే రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

ఈ కార్యక్రమంలో ఎం. రామాచారి, ఎం.డీ.మీమ్, ఏ.చంద్రమౌళి, కనకయ్య, సుబ్బరాజు, దూట విజయ, నరసయ్య, చందు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top