అన్న ఎన్టీఆర్ సేవలు చిరస్మరణీయం.
ఘనంగా ఎన్టీఆర్ 102వ జయంతి.
నివాళులర్పించిన శాసనసభ్యులు కృష్ణప్రసాదు .
అన్నమయ్య జిల్లా, రాజంపేట, : తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, అన్న ఎన్టీఆర్ సేవలు చిరస్మరణీయమని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు పేర్కొన్నారు. అన్న ఎన్టీఆర్ 102వ జయంతిని అన్నమయ్య జిల్లా రాజంపేటలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా అన్న ఎన్టీఆర్ నిలువెత్తు విగ్రహానికి మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అక్కడ నుంచి బయలుదేరి రెండవ రోజు మహానాడు కార్యక్రమానికి వెళ్లారు.
ఈ సందర్భంగా శాసనసభ్యులు కృష్ణప్రసాదు మాట్లాడుతూ స్వశక్తితో, స్వయంకృషితో, అంచెలంచెలుగా ఎదిగి, అత్యున్నత స్థానాలను అధిరోహించి, తెలుగువారి తెగువ చూపించి, తెలుగువారి ఘనతను, ఘనకీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన అసలు సిసలు తెలుగుతేజం అన్న ఎన్టీఆర్ అని అన్నారు.
అన్న ఎన్టీఆర్ కారణ జన్ముడు అని, యుగపురుషుడు అని అన్నారు. రాజకీయాలను కొత్త మలుపు తిప్పిన అపర మేధావి ఎన్టీఆర్ అని, ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా అది జనహితమే అన్నారు.
ఆయన రాజకీయంగా వేసిన ప్రతి అడుగూ ఓ సంచనలమే. పేదలకు పట్టెడన్నం పెట్టాలని తీసుకున్న నిర్ణయమే కిలో రెండు రూపాయల బియ్యం. నేడు దేశంలో అమలవుతున్న సంక్షేమ పథకాలన్నిటికీ ఎన్టీఆరే ఆద్యుడన్నారు.
తెలుగుజాతి ఆత్మగౌరవం, సామాజిక న్యాయం, ప్రజాసంక్షేమం అనే సిద్ధాంతాలపై తెలుగుదేశం పార్టీ నిర్మితమైంది. 9 నెలల పాటు అవిశ్రాంతంగా పల్లెలు, పట్టణాలు, నగరాలు కలియ తిరిగారు. జనం మైళ్లకు మైళ్లు నడుచుకుంటూ ఆ యుగపురుషుడిని ఒక్కసారి చూడాలని, ఆయన ప్రసంగం వినాలని అధిక సంఖ్యలో హాజరయ్యేవారు. సామాజిక న్యాయాన్ని, సంక్షేమ రాజ్యాన్ని ఉద్బోధించి ఉర్రూతలూగిస్తూ వారిలో ఆవేశం రగిల్చారు.
‘తెలుగుదేశం పిలుస్తోంది.. రా! కదలి రా!’ అంటూ నినదించారు. చైతన్యరథమే వేదికగా జన సముద్రాలను తన ప్రసంగాలతో ఉప్పొంగిస్తూ ఊరడించేవారు. ‘చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా’ అని పిలుస్తూ ప్రజలను ఉత్సాహపరిచేవారు. తాను అధికారంలోకి రాగానే సంక్షేమ రాజ్యం స్థాపిస్తానని వాగ్దానం చేసి మాట నిలుపుకున్నారు. ‘సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లంటూ’ నినదించారు. కేవలం 9 నెలల్లోనే పార్టీని స్థాపించి, అధికారం చేపట్టి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులకెక్కారు.
అన్న ఎన్టీఆర్ నెలరోజుల్లోనే ముఖ్యమంత్రిగా అనేక విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నారు. తరతరాలుగా గ్రామాల్లో పెత్తనం చెలాయిస్తూ ప్రజలను పీడిస్తున్న మున్సబు, కరణాలు, పటేల్, పట్వారీ వ్యవస్థలను రద్దు చేశారు. పాలనా వికేంద్రీకరణ ద్వారా ప్రభుత్వాన్ని ప్రజలకు చేరువ చేయడానికి మండల వ్యవస్థకు దేశంలోనే తొలిసారి ఎన్టీఆర్ గారు శ్రీకారం చుట్టారు.
పురుషులతో సమానంగా మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్లను కల్పించారు. మహిళల కోసం పద్మావతి మహిళా విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. స్థానిక సంస్థల పదవుల్లో బీసీలకు 20శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత ఎన్టీఆర్కు దక్కుతుంది. తక్కువ ధరకు విద్యుత్, వృద్ధాప్య పెన్షన్, తెలుగుగంగ స్థాపన.. రూ.2కే కిలో బియ్యం, పేదలకు పక్కా ఇళ్లు, జనతా వస్త్రాల పథకం లాంటి అనేక విప్లవాత్మకమైన నిర్ణయాలను ఎన్టీఆర్ తీసుకున్నారని శాసనసభ్యులు కృష్ణప్రసాదు పేర్కొన్నారు.
టీడీపీ జాతీయ అధ్యక్షులు, సీఎం చంద్రబాబు గారు, మంత్రి నారా లోకేష్ అన్న ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా తెలుగుదేశం పార్టీ నడిపిస్తూ, ప్రజలకు సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు. రాజంపేట, మైలవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
