రోడ్లపై వర్షపునీరు నిలవ లేకుండా చూడండి . తిరుపతి మున్సిపల్ కమిషనర్ మౌర్య
తిరుపతి: రానున్న వర్షాకాలం నేపథ్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షపునీరు రోడ్లపై నిలిచిపోతున్నాయని, సజావుగా వెళ్లేలా తగు చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య అధికారులను ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చిన వినతుల పరిష్కారంలో భాగంగా బుధవారం ఉదయం 12వ వార్డు లోని ఎస్ టీ వీ నగర్ , వెంకట రెడ్డి కాలనీ , గాంధీపురం, కెనడి నగర్, పాత తిరుచానూరు రోడ్డులో కార్పొరేటర్ ఎస్.కె.బాబు, వివిధ శాఖల అధికారులతో కలసి పరిశీలన చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షాలకు నీరు రోడ్లపై ఆగి పోతున్నాయని ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ఇంజినీరింగ్ అధికారులు ఆయా ప్రాంతాలను పరిశీలించి వర్షపునీరు నిలవకుండా సజావుగా వెళ్లేలా చర్యలు చేపట్టాలని అన్నారు.
అలాగే పలు చోట్ల మరమ్మతులకు గురైన డ్రైనేజీ కాలువలను సరి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని కోరారు. వెంకటేశ్వర థియేటర్ వద్ద ఏర్పాటు చేయనున్న రైల్వే బ్రిడ్జి పనులు వేగంగా పూర్తి అయ్యేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్య పనులు మెరుగ్గా చేపట్టాలని, ఎప్పటికప్పుడు డ్రైనేజీ కాలువలు శుభ్రం చేయించాలని అన్నారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, మునిసిపల్ ఇంజనీర్ తులసి కుమార్, ఏసీపీ బాలాజీ, డి.ఈ.లు మహేష్, రాజు, శిల్ప, శానిటరీ సూపర్ వైజర్ సుమతి తదితరులు ఉన్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
