
ప్రమాదాల సమయంలో గోల్డెన్ అవర్‌ను వినియోగిస్తే ప్రాణాలు కాపాడవచ్చు ….
–జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష…
పెద్దపల్లి// ప్రమాదాల సమయంలో గోల్డెన్ అవర్‌ను సద్వినియోగం చేసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.
సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి గ్రామంలో నిర్వహించిన ఏరైవ్ – ఏలైవ్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ హర్ష రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, హిట్ అండ్ రన్ కేసులు , ఇతర రోడ్డు ప్రమాదాల్లో బాధితులకు ప్రభుత్వం రూ.2 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నదని తెలిపారు. గత సంవత్సరం జిల్లాలో సుమారు 30 మంది బాధితులకు ఈ సహాయం అందించినట్లు పేర్కొన్నారు.
రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు బాధితులను ఆసుపత్రికి తరలిస్తే పోలీస్ కేసుల్లో చిక్కుకుంటామనే అపోహలు ప్రజల్లో ఉన్నాయని, అలాంటి భయాలు అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రమాద బాధితులను ఆసుపత్రికి తరలించిన వారికి రహ వీర్ పథకం క్రింద రూ.25 వేల ప్రోత్సాహకం అందజేయనున్నట్లు తెలిపారు.
ప్రమాదం జరిగిన తర్వాత మొదటి గంట గోల్డెన్ అవర్‌గా ఉండి, ఈ సమయంలో సరైన వైద్యం అందిస్తే ప్రాణాలను కాపాడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పేర్కొన్నారు. గోల్డెన్ అవర్‌లో చికిత్స అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా ప్రమాద బాధితులకు రూ.1.5 లక్షల వరకు ఉచిత చికిత్స అందించనున్నట్లు వెల్లడించారు. ఈ పథకాలు త్వరలో అమల్లోకి రానున్నాయని తెలిపారు.
రోడ్డు మీద ప్రయాణించే ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదానికి దారితీస్తుందని హెచ్చరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్, అతివేగం, మొబైల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపడం వంటి ప్రమాదకర అలవాట్లను పూర్తిగా నివారించాలని సూచించారు.
రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా మాట్లాడుతూ, ప్రతి ఇంటిలో పిల్లలకు రోడ్డు భద్రత నిబంధనలపై అవగాహన కల్పించాలని కోరారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం పోలీస్ శాఖ నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో తహశీల్దార్ భషిరోద్దీన్, ట్రాఫిక్ ఏ.సి.పి.శ్రీనివాస్,సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
