ఏప్రిల్ 14న ‘వీ హబ్’ నైపుణ్య శిక్షణ కేంద్రం ప్రారంభం…

Spread the love

ఏప్రిల్ 14న ‘వీ హబ్’ నైపుణ్య శిక్షణ కేంద్రం ప్రారంభం…

మహిళా పారిశ్రామికవేత్తల సాధికారతే లక్ష్యం ….

–జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష…

పెద్దపల్లి// మహిళలు స్వయం శక్తితో ఎదిగి పారిశ్రామికవేత్తలుగా రాణించేలా ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ నేపథ్యంలో ఏప్రిల్ 14న ఉదయం గం.11-00లకు ఐటి, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్, పరిశ్రమలు, వాణిజ్యం శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు ‘వీ హబ్ మహిళా నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని’ ప్రారంభించనున్నట్లు తెలిపారు.

ఈ కేంద్రం ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళలు తమ ఆదాయ మార్గాలను మెరుగుపరుచుకొని స్వంత వ్యాపారాలు ప్రారంభించేందుకు అవసరమైన శిక్షణ అందించబడుతుందని తెలిపారు. మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు మార్కెట్‌లో గుర్తింపు వచ్చేలా బ్రాండింగ్, ప్యాకేజింగ్, నాణ్యతా ప్రమాణాలపై నిపుణులచే అవగాహన కల్పించబడుతుందని పేర్కొన్నారు.

అలాగే ఉత్పత్తులను సమర్థవంతంగా విక్రయించడానికి అవసరమైన మార్కెటింగ్ నైపుణ్యాలు, పోటీ పరిస్థితులను ఎదుర్కొనే విధానాలపై కూడా శిక్షణ అందించబడుతుందని తెలిపారు. గృహిణులతో పాటు డిగ్రీ, బీటెక్ చదువుతున్న విద్యార్థినులకు సాఫ్ట్ స్కిల్స్ మరియు ఉపాధి నైపుణ్యాలపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించబడతాయని వివరించారు.
మహిళలు కేవలం ఉత్పత్తుల తయారీదారులుగానే కాకుండా, వాటిని మార్కెట్ చేసే స్థాయికి ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ తెలిపారు.

ఈ కార్యక్రమానికి జిల్లాలోని ప్రజా ప్రతినిధులు, అధికారులు, స్వయం సహాయక సంఘాల మహిళలు, కళాశాలల విద్యార్థినులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కలెక్టర్ ఆ ప్రకటనలో కోరారు.

You cannot copy content of this page

Scroll to Top