పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై సీపీఐ నిరసన…

TEJA NEWS

పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై సీపీఐ నిరసన…

ఆటో ట్రాలీని తాళ్లతో లాగుతూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన…

పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి:గోదావరిఖని,
పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ రామగుండం నగర సమితి ఆధ్వర్యంలో శనివారం గోదావరిఖని చౌరస్తా వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటో ట్రాలీని తాళ్లతో లాగుతూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సీపీఐ శ్రేణులు వినూత్నంగా నిరసన తెలిపారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ నగర కార్యదర్శి కే. కనకరాజ్, సీపీఐ కార్పొరేటర్ మార్కపూరి సూర్య మాట్లాడుతూ, ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన బీజేపీ సభలో ప్రధాని నరేంద్ర మోదీ పొదుపు మంత్రం చెప్పిన కొద్ది రోజులకే పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి సామాన్య ప్రజలపై ఆర్థిక భారం మోపారని విమర్శించారు.

ఇంధన ధరల పెరుగుదలతో నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగి ప్రజల జీవన వ్యయం అధికమవుతోందని పేర్కొన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ముందు దేశంలో చమురు, గ్యాస్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని చెప్పిన కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు ధరలు ఎందుకు పెంచిందో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.

అమెరికా, ఇరాన్ యుద్ధ పరిస్థితుల వల్ల దేశానికి ఎలాంటి ప్రభావం లేదని గతంలో పేర్కొన్న ప్రభుత్వం, ఇప్పుడు ధరల పెంపు చేయడం ప్రజలను మోసం చేయడమేనని ఆరోపించారు. వెంటనే పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు మాటేటి శంకర్, తొడుపునూరి రమేశ్ కుమార్, అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వై.లెనిన్, నాయకులు గొడిశల నరేశ్, కరీం, చంద్రశేఖర్, సుధీర్, జగన్, ఆసాల నవీన్, కొమ్ము రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top