
వడదెబ్బ బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి….
ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలి….
–మేయర్ మహంకాళి స్వామి….
పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: రామగుండం,
వడదెబ్బ బాధితులకు తక్షణ వైద్య సహాయం అందించేందుకు వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి సూచించారు. ఇటీవల ఎండల తీవ్రత పెరగడంతో వడదెబ్బ బారిన పడి ప్రజలు అస్వస్థతకు గురవడం, మరణాలు సంభవిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన ఆయన వైద్య సేవల తీరును పరిశీలించారు.
ఆసుపత్రి వార్డులను సందర్శించి రోగులతో మాట్లాడిన మేయర్ అనంతరం వైద్యులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రోగులు ఆసుపత్రిలో వైద్యులు పూర్తి సమయం అందుబాటులో ఉండడం లేదని, కొన్ని విభాగాల అధిపతులు విధులకు హాజరు కావడం లేదని ఫిర్యాదు చేశారు. అలాగే నీటి శుద్ధి యంత్రాలు, ఫ్యాన్లు, కూలర్లు పనిచేయకపోవడం, ఐసీయూ, అత్యవసర విభాగాల్లో ఎయిర్ కండిషనర్లు సరిగా పనిచేయకపోవడం వంటి సమస్యలను మేయర్ దృష్టికి తీసుకువచ్చారు.
వైద్యులు స్పందిస్తూ ఆసుపత్రిలో అదనంగా 10 కూలర్లు, 20 ఫ్యాన్లు అవసరమని, వడదెబ్బ ప్రభావాన్ని తగ్గించేందుకు స్ప్రింక్లర్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఎంఆర్ఐ స్కానింగ్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని, కొన్ని మందులు ప్రభుత్వ సరఫరాలో లేకపోవడంతో రోగులు బయట కొనుగోలు చేయాల్సి వస్తోందని వివరించారు.
దీనిపై స్పందించిన మేయర్ మహంకాళి స్వామి ఆసుపత్రికి అవసరమైన సదుపాయాలపై లిఖితపూర్వక నివేదిక అందిస్తే ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్, జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అందించాల్సిన అన్ని సేవలను తక్షణమే అందజేస్తామని తెలిపారు.
ఎండల తీవ్రత దృష్ట్యా ఆసుపత్రిలో అన్ని వేళలా వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, వైద్యులు విధులకు క్రమం తప్పకుండా హాజరుకావాలని ఆదేశించారు. ఫోన్ కాల్స్‌కు స్పందిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. అలాగే ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు ప్రభుత్వ ఆసుపత్రితో పాటు అన్ని ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులో ఉంచాలని, ప్రత్యేక ఏసీ గదులు, అంబులెన్స్ సౌకర్యం సిద్ధంగా ఉండేలా చూడాలని పేర్కొన్నారు. వార్డుల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ముస్తాఫా, ప్రభుత్వ ఆసుపత్రి ఆర్‌ఎంఓ రాజు, వైద్యులు అశోక్, అజయ్, స్వప్నలత తదితరులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
