
బక్రీద్ వేడుకలు ప్రశాంతంగా జరగాలి…
ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచన…
మసీదులు, స్లాటర్ హౌస్‌లను పరిశీలించిన వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి…..
పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి:గోదావరిఖని,
బక్రీద్ పండుగను శాంతియుత, సామరస్య వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని గోదావరిఖని వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి సూచించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మసీదులు, స్లాటర్ హౌస్‌లను సంబంధిత వెటర్నరీ వైద్యుడు డాక్టర్ ప్రసాద్‌తో కలిసి ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా పండుగ నిర్వహణకు సంబంధించిన ప్రభుత్వ మార్గదర్శకాలు, చట్టపరమైన నిబంధనలను నిర్వాహకులకు వివరించారు. వెటర్నరీ వైద్యుల ధృవీకరణ పత్రం లేకుండా ఎలాంటి పశువులను వధించరాదని స్పష్టం చేశారు. పశువుల వధ సమయంలో పరిశుభ్రత, ప్రజారోగ్య పరిరక్షణ, పర్యావరణ భద్రతకు సంబంధించిన అన్ని నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని సూచించారు.
పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నిర్వాహకులు అప్రమత్తంగా వ్యవహరించాలని, భద్రతా చర్యల్లో పోలీసు శాఖకు పూర్తి సహకారం అందించాలని కోరారు. మత సామరస్యం, పరస్పర గౌరవ భావనలతో బక్రీద్ వేడుకలను నిర్వహించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.
శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టిందని, ప్రజలు ఎలాంటి సమస్యలు తలెత్తినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి తెలిపారు.
ఈ తనిఖీల్లో వెటర్నరీ వైద్యుడు డాక్టర్ ప్రసాద్, మసీదు కమిటీ ప్రతినిధులు, స్లాటర్ హౌస్ నిర్వాహకులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
