
కుత్బుల్లాపూర్లో మంచినీటి సమస్యల పరిష్కారానికి చర్యలు వేగవంతం చేయాలి – కొలన్ హన్మంత్ రెడ్డి
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో నెలకొన్న మంచినీటి సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి స్థానిక నాయకులతో కలిసి వాటర్ వర్క్స్ ఎండీ అశోక్ రెడ్డి ని కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యలను ఎండీ దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు అధికారులు సానుకూలంగా స్పందించినట్లు హన్మంత్ రెడ్డి తెలిపారు. అనంతరం బాచుపల్లిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, గత 15 సంవత్సరాలలో జరగని అభివృద్ధి ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరుగుతోందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు.
కుత్బుల్లాపూర్ ప్రజలు నీటి కొరతతో ఇబ్బందులు పడకుండా చూడటం తమ బాధ్యత అని పేర్కొన్న హన్మంత్ రెడ్డి, రాబోయే ఏడాది కాలంలో నియోజకవర్గంలో ఎలాంటి మంచినీటి సమస్య లేకుండా చేయడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యల పరిష్కారమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రతి కాలనీకి తగినంత తాగునీటి సరఫరా అందేలా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని వెల్లడించారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
