
విదేశాల్లో ఉద్యోగాలకు యువతకు సువర్ణావకాశం…
జూలై 20లోపు దరఖాస్తు చేసుకోవాలి…
— జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష…
పెద్దపల్లి// జిల్లా ప్రతినిథి: పెద్దపల్లి, తెలంగాణ విదేశీ ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో వివిధ దేశాల్లో ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
జర్మనీ, ఒమాన్, ఖతార్, ఇజ్రాయెల్, దుబాయ్, జపాన్, కెనడా, సౌదీ అరేబియా, రష్యా, గ్రీస్, మారిషస్ తదితర దేశాల్లో పలు రంగాలకు చెందిన ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. విద్యుత్, నిర్మాణం, వైద్య సేవలు, నర్సింగ్, వాహనాల మరమ్మతు, వస్త్ర తయారీ, వ్యవసాయం, ఆహార తయారీ, హోటల్ నిర్వహణ తదితర విభాగాల్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.
ఈ ఉద్యోగాలకు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 20వ తేదీలోపు సమీకృత కలెక్టరేట్‌లోని జిల్లా ఉపాధి కార్యాలయం, గది సంఖ్య 233లో సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
మరిన్ని వివరాల కోసం తెలంగాణ విదేశీ ఉపాధి సంస్థ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చని, అలాగే 7382452944 నంబర్‌ను సంప్రదించవచ్చని తెలిపారు.
విదేశాల్లో లభిస్తున్న ఉపాధి అవకాశాలను యువత సద్వినియోగం చేసుకొని తమ భవిష్యత్తును మరింత మెరుగుపరచుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పిలుపునిచ్చారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
