
కేంద్ర బొగ్గు & గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డిని కలిసిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి…
పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: న్యూఢిల్లీ,
పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, తెలంగాణ రాష్ట్ర గనులు మరియు కార్మిక శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామితో కలిసి కేంద్ర బొగ్గు & గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి ని న్యూఢిల్లీలోని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో అత్యంత ప్రాధాన్యం కలిగిన తాడిచెర్ల-2 బొగ్గు గని ప్రాజెక్టు పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. ప్రాజెక్టు ఆలస్యం కాకుండా త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు స్థానిక యువతకు కనీసం 1000 ఉద్యోగాలు కల్పించాలని, ముఖ్యంగా ప్రాజెక్టు ప్రభావిత గ్రామాల యువతకు ఉద్యోగాల్లో ప్రాధాన్యం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
ప్రాజెక్టు కారణంగా నిర్వాసితులైన కుటుంబాలకు పునరావాసం, పునరుద్ధరణ (ఆర్&ఆర్ ) ప్యాకేజీ కింద సమగ్ర సౌకర్యాలు కల్పించాలని, బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
అదేవిధంగా, సింగరేణి సంస్థలో పదవీ విరమణ పొందిన కార్మికులకు కనీస నెలవారీ పెన్షన్ ₹10,000 అందేలా కేంద్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు. ప్రస్తుతం తక్కువ పెన్షన్‌తో జీవనం సాగిస్తున్న వేలాది మంది రిటైర్డ్ కార్మికుల సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా సింగరేణి సంస్థ అభివృద్ధి, బొగ్గు గనుల విస్తరణ, గనుల ప్రభావిత ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు కేంద్ర ప్రభుత్వ సహకారంతో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై కూడా విస్తృతంగా చర్చించారు.
వారి వినతిపై స్పందించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తాడిచెర్ల-2 ప్రాజెక్టు పనుల వేగవంతం, స్థానిక యువతకు ఉద్యోగాల కల్పన,ఆర్&ఆర్ ప్యాకేజీ అమలు, అలాగే సింగరేణి పదవీ విరమణ పొందిన కార్మికుల కనీస పెన్షన్ అంశాలను సంబంధిత శాఖలతో చర్చించి సానుకూలంగా పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకునేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
