
సూపర్ ఎల్‌నినోతో అప్రమత్తం.. ప్రత్యామ్నాయ పంటల సాగును విస్తృతంగా ప్రోత్సహించాలి…
— కలెక్టర్ కోయ శ్రీహర్ష…
పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి:
సూపర్ ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రైతులు వరి సాగుకు బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టేలా క్షేత్రస్థాయిలో విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులను ఆదేశించారు.
కలెక్టరేట్ సమావేశ మందిరంలో వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఖరీఫ్ సాగు పరిస్థితులు, ప్రత్యామ్నాయ పంటల ప్రోత్సాహం, ఫార్మ్ పాండ్ల నిర్మాణ పురోగతిని కలెక్టర్ సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ప్రస్తుతం నీటి లభ్యత పరిమితంగా ఉన్నందున వరి సాగును ప్రోత్సహించకుండా కందులు, పెసలు, మినుములు, నువ్వులు, పొద్దుతిరుగుడు, ఆయిల్‌పామ్ వంటి ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులను ప్రోత్సహించాలని సూచించారు.
అందుబాటులో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా పంటల మార్పిడి చేపడితే రైతులకు ఆదాయం లభించడంతో పాటు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు కూడా కొనసాగుతాయని తెలిపారు.
రాబోయే పది రోజులను ప్రత్యేక కార్యాచరణగా తీసుకుని గ్రామాల వారీగా రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించాలని, ప్రతిరోజూ పంట మార్పిడికి ముందుకు వచ్చిన రైతుల వివరాలను నివేదిక రూపంలో సమర్పించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో ప్రత్యామ్నాయ పంటల సాగు ఆశించిన స్థాయిలో లేదని పేర్కొంటూ, లక్ష్య సాధనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
ఒంటరి మహిళా రైతులు, చిన్న, సన్నకారు రైతులకు ఆయిల్‌పామ్‌తో పాటు ఇతర ప్రత్యామ్నాయ పంటల సాగుకు జిల్లా యంత్రాంగం ద్వారా అదనపు ప్రోత్సాహం అందిస్తామని కలెక్టర్ తెలిపారు. ఈ ఖరీఫ్‌లో జిల్లాలో 2.91 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యాన్ని తప్పనిసరిగా సాధించాలని, రైతులు భూములను బీడుగా ఉంచితే రైతు భరోసా వంటి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను కోల్పోయే అవకాశం ఉందని హెచ్చరించారు.
భూగర్భ జలాల మట్టాలను పెంచేందుకు ఫార్మ్ పాండ్ల నిర్మాణాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని, వాటి నిర్మాణానికి సంబంధించిన చెల్లింపులను 15 రోజుల్లో పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ముఖ్యంగా పెద్ద రైతులు, ఆయిల్‌పామ్ సాగు చేస్తున్న రైతులు తమ పొలాల్లో ఫార్మ్ పాండ్లు నిర్మించుకునేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా ఉద్యానవన శాఖ అధికారి ప్రసాద్, సంబంధిత శాఖల అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు తదితరులు పాల్గొన్నారు.