
ప్రజావాణి అర్జీలను పెండింగ్‌లో ఉంచొద్దు.. సత్వరమే పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష
ప్రజల నుంచి వినతులు స్వీకరించిన కలెక్టర్ – సంబంధిత శాఖల అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశం
రామగుండం,
ప్రజావాణిలో అందిన అర్జీలను అత్యంత ప్రాధాన్యంతో పరిగణించి, ఒక్క దరఖాస్తు కూడా పెండింగ్‌లో ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్ బి. శ్రీరాములతో కలిసి ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి అర్జీపై సంబంధిత అధికారులు బాధ్యతాయుతంగా స్పందించి, నిబంధనల మేరకు త్వరితగతిన పరిష్కారం చూపాలని సూచించారు.
రామగుండం నగరానికి చెందిన సాదు సత్తెమ్మ ప్రభుత్వ నర్సింగ్ కళాశాల, గోదావరిఖనిలో ఉద్యోగావకాశం కల్పించాలని వినతిపత్రం సమర్పించగా, సంబంధిత ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌కు పంపించి నిబంధనల ప్రకారం పరిశీలించి అవకాశం మేరకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
సుల్తానాబాద్ మున్సిపాలిటీ పరిధికి చెందిన జి. మల్లేశం తన కుటుంబ వారసత్వ భూమికి పట్టాదారు పాస్‌పుస్తకాలు మంజూరు చేయాలని దరఖాస్తు చేయగా, సంబంధిత తహసీల్దార్‌కు పంపించి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఎలిగేడు మండలం బుర్హాన్ మియాపేట గ్రామానికి చెందిన గౌర వెంకటయ్య తన ఇంటికి సంబంధించిన యాజమాన్య వివాదం, తనపై జరుగుతున్న వేధింపులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం సమర్పించగా, సంబంధిత రెవెన్యూ డివిజనల్ అధికారికి పంపించి నిబంధనల ప్రకారం విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
ప్రజావాణి కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొని ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను స్వీకరించి, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు ప్రారంభించారు.
ఫోటో క్యాప్షన్:
కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరించి సంబంధిత అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తున్న జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
