
మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేయాలి…
చట్టసభల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి….
— ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ…
పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి:పెద్దపల్లి,
పార్లమెంట్‌లో ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్ర ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని, ప్రస్తుత జనాభా ప్రాతిపదికన చట్టసభల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని భారత జాతీయ మహిళా సమాఖ్య (ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ) పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షురాలు శనిగరపు తిరుమల, జిల్లా కార్యదర్శి ఆసాల రమ డిమాండ్ చేశారు.
విడుదల చేసిన పత్రికా ప్రకటనలో వారు మాట్లాడుతూ, తరతరాలుగా మహిళలు హింస, అణచివేత, లింగ వివక్షకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల హక్కుల కోసం ఎన్నో ఉద్యమాలు, త్యాగాలు జరిగినప్పటికీ, మహిళల రక్షణ కోసం తీసుకొచ్చిన అనేక చట్టాలు సమర్థవంతంగా అమలు కాకపోవడం వల్ల వాటి లక్ష్యం నెరవేరడం లేదని విమర్శించారు.
సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర అత్యంత కీలకమని, అయినప్పటికీ పురుషాధిక్య భావజాలం కారణంగా మహిళల ఆత్మగౌరవం దెబ్బతింటోందని పేర్కొన్నారు. ఆధునిక సమాజంలో కూడా మహిళలపై హింస, దాడులు, వేధింపులు, లైంగిక నేరాలు కొనసాగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
మహిళలను వస్తువులుగా చూపించే ధోరణికి అడ్డుకట్ట వేయాలని, విద్య, వైద్యం, ఉపాధి, రాజకీయ రంగాల్లో మహిళలకు సమాన అవకాశాలు, ప్రాధాన్యత కల్పించాలని వారు డిమాండ్ చేశారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న మహిళా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ ఆధ్వర్యంలో నిర్వహించే ఉద్యమాలు, ఆందోళనల్లో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని తమ హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడాలని శనిగరపు తిరుమల, ఆసాల రమ పిలుపునిచ్చారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
