పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం

Spread the love

పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం
అక్రమ నిల్వలు, మళ్లింపుపై కఠిన చర్యలు..

–సీపీ అంబర్ కిషోర్ ఝా…

పెద్దపల్లిజిల్లా ప్రతినిధి, : ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం అందిస్తున్న పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా, అక్రమ నిల్వ, మళ్లింపును అరికట్టేందుకు పోలీస్, పౌరసరఫరాల శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి కఠిన చర్యలు చేపట్టాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశించారు.

పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో పోలీస్, పౌరసరఫరాల శాఖ అధికారులతో సీపీ సమన్వయ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ప్రభుత్వం అర్హులైన పేదలకు అందిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేయడం, మళ్లించడం వల్ల లబ్ధిదారులు నష్టపోతున్నారని తెలిపారు. పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా సేకరించడం, నిల్వ చేయడం, ఇతర ప్రాంతాలకు తరలించడం, మళ్లించడం వంటి కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు.

అక్రమ రవాణా వెనుక ఉన్న ప్రధాన సూత్రధారులు, మధ్యవర్తులు, నిర్వాహకులు, వాహనదారులు, సహకరిస్తున్న వ్యక్తుల నెట్‌వర్క్‌ను గుర్తించి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అక్రమ రవాణాకు అవకాశం ఉన్న మార్గాలు, సమస్యాత్మక ప్రాంతాలపై నిరంతరం నిఘా ఉంచాలని తెలిపారు.

అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని గుర్తించి స్వాధీనం చేసుకోవడంతో పాటు, అక్రమ రవాణా వెనుక ఉన్న వ్యక్తులపై సమగ్ర దర్యాప్తు చేపట్టి చర్యలు తీసుకోవాలని సీపీ స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా పోలీస్, పౌరసరఫరాల శాఖ అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

సమావేశంలో గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్, పెద్దపల్లి ఏసీపీ జి. కృష్ణ, టాస్క్‌ఫోర్స్ ఏసీపీ శ్రీనివాస్‌రావు, పౌరసరఫరాల శాఖ డీసీఎస్‌ఓ కె. శ్రీనాథ్, పెద్దపల్లి డీటీ సంతోష్ సింగ్, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top