
కాసులపల్లి లో అక్రమంగా నిల్వ చేసిన రూ.3.60 లక్షల విలువైన యూరియా స్వాధీనం….
పెద్దపల్లి -జిల్లా ప్రతినిధి, : రైతులకు అందాల్సిన యూరియాను అక్రమంగా నిల్వ ఉంచిన ఘటనలో 600 యూరియా బస్తాలను టాస్క్‌ఫోర్స్, పెద్దపల్లి రూరల్ పోలీసులు సంయుక్తంగా స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు.
రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్ ఏసీపీ శ్రీనివాసులు నేతృత్వంలో పెద్దపల్లి జోన్‌లో అక్రమ యూరియా నిల్వలపై తనిఖీలు చేపట్టారు. కాసులపల్లి గ్రామంలోని హకా ఫార్మర్స్ సర్వీస్ సెంటర్‌లో యూరియా బస్తులను అక్రమంగా డంప్ చేసి నిల్వ ఉంచినట్లు అందిన విశ్వసనీయ సమాచారంతో టాస్క్‌ఫోర్స్ ఎస్‌ఐలు దీకొండ రమేష్, లక్ష్మణ్‌రావు, పెద్దపల్లి రూరల్ ఎస్‌ఐ మధుకర్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు.
ఈ తనిఖీల్లో కాసులపల్లి గ్రామానికి చెందిన అడెపు సంపత్ (43)ను అదుపులోకి తీసుకుని, అతని వద్ద అక్రమంగా నిల్వ చేసిన 600 యూరియా బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. ఒక్కో బస్తా 50 కిలోల బరువు కాగా, ఒక్కో బస్తా విలువ రూ.600 చొప్పున మొత్తం యూరియా విలువ రూ.3.60 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.
పెద్దపల్లి మండల వ్యవసాయ అధికారి సమక్షంలో యూరియా బస్తాలను స్వాధీనం చేసుకుని, తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం అదుపులోకి తీసుకున్న వ్యక్తితో పాటు యూరియాను పెద్దపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓకు అప్పగించారు.
ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తూ, అక్రమ యూరియా నిల్వకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎరువులను నిల్వ చేసి రైతులకు ఇబ్బందులు కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
