
కిడ్నీ రోగుల ప్రాణాలతో చెలగాటం వద్దు…
గోదావరిఖని సింగరేణి ఆసుపత్రిలో డయాలసిస్ బెడ్స్, మిషన్ల సంఖ్యను 10కు పెంచాలి….
సీఎంఓకు స్వచ్ఛంద సంస్థల ఐక్యవేదిక వినతి…..
త్వరలో కొత్త యంత్రాలు ఏర్పాటు చేస్తామని హామీ…
పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి, గోదావరిఖని/ : సింగరేణి ఆర్జీ-1 గోదావరిఖని ఏరియా ఆసుపత్రిలో డయాలసిస్ సౌకర్యాలను విస్తరించి, బెడ్స్‌తో పాటు డయాలసిస్ మిషన్ల సంఖ్యను 10కు పెంచాలని స్వచ్ఛంద సంస్థల ఐక్యవేదిక ప్రతినిధులు డిమాండ్ చేశారు.
సింగరేణి ఏరియా ఆసుపత్రికి సీఎంఓ డాక్టర్ కిరణ్ రాజ్ వచ్చిన సందర్భంగా ఐక్యవేదిక అధ్యక్షుడు అయిత శివ, గౌరవ అధ్యక్షుడు మద్దెల దినేష్ కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. సింగరేణి వ్యాప్తంగా గోదావరిఖని, భూపాలపల్లిలో మాత్రమే డయాలసిస్ యూనిట్లు ఉన్నాయని, బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్, 8వ కాలనీ, సెంటినరీ కాలనీ తదితర ప్రాంతాల నుంచి ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో కిడ్నీ రోగులు గోదావరిఖని ఆసుపత్రికి వస్తున్నారని తెలిపారు.
ప్రస్తుతం ఉన్న 5 డయాలసిస్ మిషన్లు రోగుల అవసరాలకు సరిపోవడం లేదని, 12 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన పాత యంత్రాలు తరచూ మరమ్మతులకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
పారిశ్రామిక కాలుష్య ప్రభావంతో అనారోగ్యానికి గురవుతున్న సింగరేణి కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్యం అందించడం యాజమాన్యం బాధ్యత అని పేర్కొన్నారు. ఇతర అనారోగ్యాలకు చికిత్స అందించే అవకాశం ఉన్నప్పటికీ, డయాలసిస్‌పై ఆధారపడే కిడ్నీ రోగులకు సమయానికి చికిత్స అందకపోతే ప్రాణాపాయం ఏర్పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఆర్జీ-1 గోదావరిఖని సింగరేణి ఏరియా ఆసుపత్రిలో డయాలసిస్ బెడ్స్, మిషన్ల సంఖ్యను 10కు పెంచాలని, 12 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన పాత డయాలసిస్ యంత్రాలను వెంటనే మార్చాలని కోరారు. సింగరేణి సీఎస్ఆర్, డీఎంఎఫ్టీ నిధులను ఇతర ప్రాంతాలకు తరలించకుండా సింగరేణి కార్మికులు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిరక్షణకు వినియోగించాలని విజ్ఞప్తి చేశారు.
దశాబ్దాలుగా రక్తాన్ని చెమటగా మార్చి సంస్థకు కోట్లాది రూపాయల లాభాలు తెచ్చిన కార్మికుల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దని, తక్షణమే ఆధునిక డయాలసిస్ యంత్రాలను ఏర్పాటు చేసి కార్మికులు, వారి కుటుంబ సభ్యుల ప్రాణాలను కాపాడాలని కోరారు.
స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల వినతిపై స్పందించిన సీఎంఓ డాక్టర్ కిరణ్ రాజ్ త్వరలో నూతన డయాలసిస్ యంత్రాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
