
అశ్వారావుపేటలో వైన్‌షాపుల్లో స్టాక్ నిల్
బెల్ట్ షాపుల్లో స్టాక్ ఫుల్*
క్వార్టర్‌కు రూ.20 నుంచి రూ.80 అధిక ధరలతో విక్రయాలు
సిండికేట్‌గా చక్రం తిప్పుతున్న అశ్వారావుపేట మద్యం డాన్
చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్న ఎక్సైజ్‌శాఖపై ఆరోపణలు
అశ్వారావుపేట :
నియోజకవర్గంలోని అశ్వారావుపేట మండలంలో మద్యం వ్యాపారులు.. సిండికేట్‌గా మారి మద్యం దందా నిర్వహిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మండల పరిధిలోని కొన్ని వైన్ షాపులు సిండికేట్‌గా మారి బెల్ట్ షాపులకు అధిక ధరలకు విక్రయిస్తూ దందా నిర్వహిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ప్రధానంగా వైన్‌షాపులకు చెందిన వ్యాపారులంతా వారి పరిధిలోని బెల్ట్ షాపులకు రూ.20 నుంచి రూ.80 వరకు ధరలు పెంచి విక్రయించటం జరుగుతుందని పలువురు పేర్కొంటున్నారు. మరోవైపు వైన్‌షాపులొ ఉండాల్సిన స్టాక్‌ను ఉంచడం లేదని బెల్ట్ షాపులకు తరలిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైన్‌షాపులో లభించని అన్ని రకాల బ్రాండ్లు బెల్ట్ షాపుల్లో లభించడం పలు అనుమానాలకు తావిస్తోంది.
బెల్ట్ షాపులను ప్రోత్సహించడం.. అధిక ధరలకు మద్యం విక్రయించడంతో సిండికేట్ లాభపడుతూనే, అదే సమయంలో ప్రభుత్వానికి భారీ ఆదాయ నష్టాన్ని కలిగిస్తోందన్నది స్పష్టమవుతోంది. మరోవైపు మద్యం ప్రియులకు ప్రభుత్వం నిర్ధేశించిన ఎమ్మార్పీ ధరలకు లభించాల్సిన మద్యం దొరక్క బెల్ట్ షాపుల్లో అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తుందని మద్యం ప్రియులు ఆరోపిస్తున్నారు. ప్రతీ ఏటా కోట్ల రూపాయల సిండికేట్ దందా జరుగుతుందని బహిరంగంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైన్‌షాపుల్లో విక్రయించాల్సిన మద్యంను విక్రయించకుండా… బెల్ట్ షాపులకు అధిక ధరలకు విక్రయించి బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తూ కోట్లు గడిస్తున్నారు. ఇలా ప్రభుత్వ ఖజానాకు గండికొడున్న వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
గ్రామాల్లో బెల్ట్ షాపుల కారణంగా… అనేక ఇబ్బందులు వస్తున్నాయని గ్రామీణ ప్రజలు ఆరోపణలు చేస్తున్నారు. గ్రామాల్లో అర్ధరాత్రి బెల్ట్ షాపుల మద్యం అమ్మకాల వలన ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఎక్సైజ్ శాఖ పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. అర్ధరాత్రులు మద్యం సేవించి ఆకతాయిలు వివాదాలు చేస్తూ ప్రజలను వేధిస్తున్నారనే సంఘటనలు ఉన్నాయి.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
