
కార్మిక హక్కుల కోసం పోరాటమే లక్ష్యం…
ఏఐటీయూసీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా రెండోసారి శనిగరపు చంద్రశేఖర్ ఎన్నిక…
కార్మిక చట్టాలు, ఉద్యోగ భద్రత కోసం ఉద్యమాలు ఉధృతం చేస్తాం…
పెద్దపల్లి- జిల్లా ప్రతినిధి, గోదావరిఖని//
ఏఐటీయూసీ నాలుగో రాష్ట్ర మహాసభల్లో గోదావరిఖనికి చెందిన శనిగరపు చంద్రశేఖర్ రెండోసారి రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పద్మనాయక కల్యాణ మండపంలో సెప్టెంబర్ 6, 7, 8 తేదీల్లో నిర్వహించిన రాష్ట్ర మహాసభలు ఘనంగా జరిగాయి. మహాసభల సందర్భంగా నిర్వహించిన మహా ప్రదర్శనలో పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.
మహాసభల్లో ఏఐటీయూసీ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ అమర్‌జీత్ కౌర్ మాట్లాడుతూ కార్మిక వర్గం ఐక్యంగా ఉండి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. కార్మికుల హక్కుల పరిరక్షణకు ఏఐటీయూసీని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్మిక వర్గానికి అండగా నిలుస్తూ భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకోవాలని పిలుపునిచ్చారు.
రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నికైన సందర్భంగా శనిగరపు చంద్రశేఖర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు కార్మిక కోడ్‌లను రద్దు చేసి, కార్మిక ఉద్యమాల ద్వారా సాధించుకున్న 44 కార్మిక చట్టాలను కొనసాగించే వరకు పోరాటాలు కొనసాగిస్తామని అన్నారు. కార్మిక చట్టాల పరిరక్షణ, కార్మిక హక్కులు, ఉద్యోగ భద్రత, ఉపాధి హామీ కోసం నిరంతరం ఉద్యమిస్తామని స్పష్టం చేశారు.
కార్మికుల హక్కులను హరించే విధానాలను ప్రభుత్వాలు ఉపసంహరించుకునే వరకు పోరాటం తప్పదని ఆయన హెచ్చరించారు. కార్మిక వర్గం ఐక్యంగా ఉద్యమించి తమ హక్కులను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.
చంద్రశేఖర్ ఎన్నికైన సందర్భంగా ఏఐటీయూసీ నగర సమితి నాయకులు అబ్దుల్ కరీం, రెడపాక లక్ష్మణ్, నాంసాని శంకర్, కలికోట సతీష్ కుమార్, షేక్ మసూద్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
