
ప్రజల భద్రతే పోలీసుల ప్రథమ కర్తవ్యం…
ప్రజాపాలన దినోత్సవంలో పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా….
రామగుండం కమిషనరేట్‌లో ఘనంగా ప్రజాపాలన దినోత్సవ వేడుకలు….
పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి గోదావరిఖని, : రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ప్రజాపాలన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు డీసీపీ (పరిపాలన) కె. శ్రీనివాస్ మొక్కను అందజేసి పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝాకు స్వాగతం పలికారు.
అనంతరం పోలీస్ కమిషనర్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించి కమిషనరేట్ కార్యాలయ భవనం వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు. అధికారులు, సిబ్బందితో కలిసి జాతీయ గీతంతో పాటు రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ’ను ఆలపించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజలకు చారిత్రక ప్రాధాన్యత కలిగిన రోజని అన్నారు. నిజాం పాలన నుంచి తెలంగాణ ప్రాంతం భారత యూనియన్‌లో విలీనమై దేశంలో అంతర్భాగంగా మారిన చారిత్రక పరిణామాన్ని గుర్తు చేసుకోవాలని తెలిపారు. ఈ పరిణామం కోసం నాడు ఎన్నో త్యాగాలు, బలిదానాలు చేసిన వారిని గౌరవంగా స్మరించుకోవాలని అన్నారు.
వారి త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని దేశ సమగ్రత, ఐక్యతను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం, అభివృద్ధి కోసం ప్రజలంతా ఐక్యంగా పనిచేయాలని సూచించారు.
ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించడం, వారి భద్రతను కాపాడటం, శాంతిభద్రతలను పటిష్టంగా పరిరక్షించడం పోలీస్ శాఖ ప్రధాన బాధ్యత అని అంబర్ కిషోర్ ఝా స్పష్టం చేశారు. ప్రజలకు మరింత చేరువగా ఉంటూ వారి భద్రత, సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తున్నామని తెలిపారు.
రామగుండం కమిషనరేట్ పరిధిలో ప్రజలకు ఉత్తమమైన పోలీస్ సేవలు అందిస్తూ శాంతిభద్రతలను సమర్థవంతంగా పరిరక్షించేందుకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని అన్నారు. సెప్టెంబర్ 17 స్ఫూర్తితో రాష్ట్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి కొనసాగించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ కె. శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ నాగేంద్ర గౌడ్, గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, సీసీఎస్ ఏసీపీలు రవీందర్, ప్రవీణ్ కుమార్, టాస్క్‌ఫోర్స్ ఏసీపీ శ్రీనివాస్ రావు, ఏవో శ్రీనివాస్, ఆర్‌ఐలు మల్లేశం, దామోదర్, రమేష్, గోదావరిఖని వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, గోదావరిఖని టూటౌన్ సీఐ ప్రసాద్ రావు, రామగుండం సీఐ కృష్ణ కుమార్, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ రాజేశ్వరరావు, వివిధ విభాగాల ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, సీపీఓ సిబ్బంది, ఏఆర్ సిబ్బంది, ప్రత్యేక బృందాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
