మహిళలను ఆర్థికంగా, పారిశ్రామికంగా శక్తివంతం చేయాలి…

Spread the love

మహిళలను ఆర్థికంగా, పారిశ్రామికంగా శక్తివంతం చేయాలి…
మహిళలకు ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలు విస్తృతం చేయాలి…

–కలెక్టర్ కోయ శ్రీహర్ష…

పెద్దపల్లి- జిల్లా ప్రతినిధి పెద్దపల్లి, : మహిళలను ఆర్థికంగా స్వావలంబన దిశగా నడిపిస్తూ, వివిధ రంగాల్లో పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. మహిళలకు ఆర్థిక అంశాలపై విస్తృత అవగాహన కల్పించడంతో పాటు మరిన్ని ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.

సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో జిల్లా మహిళా సాధికారత కేంద్రం పనితీరుపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. మహిళలకు అందిస్తున్న సేవలు, ఉపాధి అవకాశాలు, నైపుణ్య శిక్షణ, ప్రభుత్వ పథకాల అమలు, ఆర్థిక సాధికారత తదితర అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బ్యాంకింగ్ సేవలు, పొదుపు, రుణాలు, ప్రభుత్వ పథకాలు, స్వయం ఉపాధి అవకాశాలు, ఆర్థిక నిర్వహణ తదితర అంశాలపై మహిళలకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, యువతులు, ఉద్యోగార్థులు, వ్యాపారం ప్రారంభించాలనుకునే మహిళలను గుర్తించి వారికి అవసరమైన మార్గదర్శకత్వం అందించాలని ఆదేశించారు.

మార్కెట్‌లో డిమాండ్ ఉన్న రంగాలను గుర్తించి ఆయా రంగాల్లో మహిళలకు అవసరమైన నైపుణ్య శిక్షణ అందించాలని తెలిపారు. శిక్షణ పొందిన మహిళలకు ఉపాధి లేదా స్వయం ఉపాధి కల్పించే వరకు సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

మహిళలు కేవలం ఉద్యోగాలు పొందే స్థాయిలో కాకుండా, ఇతరులకు ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగేలా ప్రోత్సహించాలని కలెక్టర్ అన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులు, ఆహార తయారీ, ఉద్యానవన ఉత్పత్తుల విలువ ఆధారిత తయారీ, సేవా రంగాల్లో మహిళలకు ఉన్న అవకాశాలను వివరించాలని సూచించారు.

మహిళల ఆర్థిక సాధికారత కోసం ప్రభుత్వం కల్పిస్తున్న వివిధ అవకాశాలను సద్వినియోగం చేసుకునేలా జిల్లాలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. ఆర్టీసీ బస్సులు, పెట్రోల్ బంకులు, క్యాంటీన్లు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు తదితర రంగాల్లో మహిళలకు ఉన్న అవకాశాలను చేరువ చేయాలని సూచించారు.

పెద్దపల్లి జిల్లాలో అందుబాటులో ఉన్న వీ-హబ్ సేవలను మహిళా పారిశ్రామికవేత్తలు, వ్యాపారం ప్రారంభించాలనుకునే మహిళలు సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.

వ్యాపార ఆలోచనల అభివృద్ధి, నైపుణ్య శిక్షణ, మార్గదర్శకత్వం, మార్కెటింగ్ తదితర అంశాల్లో అందుబాటులో ఉన్న సహాయాన్ని మహిళలకు చేరువ చేయాలని సూచించారు.

ప్రభుత్వ పథకాలు, రుణ సదుపాయాలు, శిక్షణ కార్యక్రమాలు, ఉపాధి అవకాశాలపై గ్రామ, మండల స్థాయిలో అవగాహన కల్పించాలని తెలిపారు. మహిళా సాధికారతకు సంబంధించిన అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేసి, మహిళలకు అందుబాటులో ఉన్న పథకాలు, శిక్షణ, ఉపాధి, ఆర్థిక సహాయ కార్యక్రమాలను సమర్థవంతంగా చేరవేయాలని సూచించారు.

మహిళలు ప్రారంభించే స్వయం ఉపాధి, వ్యాపార కార్యకలాపాలు నిలదొక్కుకునేలా శిక్షణతో పాటు మార్కెటింగ్, రుణ సదుపాయాలు, అవసరమైన సహకారం అందించాలని కలెక్టర్ ఆదేశించారు. మహిళలకు అందిస్తున్న శిక్షణ, ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలపై క్రమం తప్పకుండా సమీక్ష నిర్వహించి పురోగతిని నమోదు చేయాలని సూచించారు.

ఈ సమావేశంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి, జిల్లా ఉపాధి అధికారి, ఇంటర్మీడియట్ అధికారి కల్పన, గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డైరెక్టర్ వెంకటేష్, జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ ప్రవీణ్, వీ-హబ్ సమన్వయకర్త, టాస్క్ సమన్వయకర్త కౌసల్య, జిల్లా మహిళా సాధికారత కేంద్రం ప్రతినిధులు, సఖి బృందం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top