అద్దెకు ఉంటూ.. యజమాని ఇంట్లోనే చోరీ!

Spread the love

అద్దెకు ఉంటూ.. యజమాని ఇంట్లోనే చోరీ!

నిందితుడి అరెస్ట్.. రూ.3 లక్షల విలువైన 55.200 గ్రాముల బంగారం స్వాధీనం

గుంటూరు: అద్దెకు ఉంటున్న ఇంటి యజమానుల ఇంట్లోనే చోరీకి పాల్పడిన నిందితుడిని లాలాపేట పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఈస్ట్ డీఎస్పీ టి.సీతారాం తెలిపారు. అహ్మద్ నగర్‌లో జరిగిన గృహ దొంగతనం కేసులో నిందితుడు షేక్ మహమ్మద్ రఫీ (28)ను రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. అతని వద్ద నుంచి రూ.3 లక్షల విలువైన 55.200 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

బాధిత కుటుంబం వైద్య చికిత్స కోసం విశాఖపట్నం వెళ్లిన సమయంలో నిందితుడు ఇంటి తాళాలు పగలగొట్టి సుమారు 153 గ్రాముల బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, రూ.5 వేల నగదు అపహరించినట్లు డీఎస్పీ వివరించారు. సాంకేతిక నిఘా, వేలిముద్రల ఆధారంగా నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేసినట్లు తెలిపారు. మిగిలిన సొత్తు రికవరీ కోసం దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు చెప్పారు.

ఎస్పీ వకుల్ జిందాల్ ఐపీఎస్ సూచనల మేరకు తన పర్యవేక్షణలో లాలాపేట సీఐ శివప్రసాద్, ఎస్ఐ వెంకటరావు, హెచ్‌సీ ఎం.కల్యాణ్, పోలీసు సిబ్బంది కిరణ్ కుమార్, పి.శంకర్ సమన్వయంతో కేసును ఛేదించినట్లు డీఎస్పీ తెలిపారు. ప్రతిభ కనబరిచిన సిబ్బందిని ఎస్పీ అభినందించినట్లు పేర్కొన్నారు

You cannot copy content of this page

Scroll to Top