వర్షాకాల జాగ్రత్తలు తీసుకోండి
** అధికారులతో మున్సిపల్ కమిషనర్
తిరుపతి: వర్షాలు కురుస్తున్న తరుణంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులూ కలగకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ నారపురెడ్డి మౌర్య అధికారులను ఆదేశించారు. గురువారం ఆమె నగరంలోని 15వ వార్డుకు చెందిన పద్మావతి పార్క్ పరిసర ప్రాంతాల్లో అధికారులతో కలసి పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ప్రతి రోజూ చెత్త బండి వస్తోందా, త్రాగునీరు సకాలంలో వస్తున్నాయా అనే విషయాలు ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న తరుణంలో పారిశుద్ధ్య పనులు మెరుగ్గా చేపట్టాలని అన్నారు.
వర్షపు నీరు రోడ్లపైకి రాకుండా మురుగునీటి కాలువల్లో చెత్తను తొలగించాలని కోరారు. దోమలు ప్రబలకుండా మందులు పిచికారీ చేయించాలని తెలిపారు. పద్మావతి పార్కులోని వాకింగ్ ట్రాక్ లో గుంతలను సరిచేసి, శుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. అన్నా క్యాంటీన్ ను పరిశీలించి, ప్రజలకు నాణ్యమైన ఆహార పదార్థాలను అందించాలని సూచించారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, మునిసిపల్ ఇంజినీర్ తులసి కుమార్ , హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ అధికారి రవి, ఏసిపి బాలాజి , డి.ఈ.లు మహేష్, శిల్ప, శానిటరీ సూపర్ వైజర్ చెంచయ్య తదితరులు ఉన్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
