ఆవుల దాడి ఘటన తిరుపతిలో కాదు
** నగర ప్రజలకు మేయర్ శిరీష వివరణ
తిరుపతి: తిరుపతిలోని నాలుగు కూడలి వద్ద ఆవులు దాడి చేసినట్లు, అందులో ఇద్దరు వ్యక్తులు గాయపడినట్లు ఓ విడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. ఈ ఘటన తిరుపతిలో చోటుచేసుకున్నది కాదని… తిరుపతి నగర ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దని నగర పాలక సంస్థ మేయర్ డా.శిరీష యాదవ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. ఆవుల దాడి ఘటన తన దృష్టికి వచ్చిన వెంటనే నగర కమిషనర్ దృష్టికి తీసుకుని వెళ్లానని, ఆమె పూర్తిగా విచారించి ఈ ఘటన తిరుపతిలో జరగలేదని వివరణ ఇచ్చారని మేయర్ పేర్కొన్నారు. ఈ వీడియోను తిరుపతికి చెందిన కొందరు ముందు జాగ్రత్త కోసం కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్నారని తెలిపారు. ఏ ఉద్దేశ్యంతో చేసినా ప్రజలు ఆందోళన చెందే అవకాశం ఉన్నది కనుక ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు నగర పాలక సంస్థ సిబ్బంది దృష్టికి తీసుకురావాలని కోరారు. అనవసర ఆందోళన కలిగించే ప్రచారం మంచిది కాదన్నారు. ఏది ఏమైనా ఇలాంటి సంఘటనలు తిరుపతి నగరంలో జరగకుండా తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కమిషనర్ కు మేయర్ శిరీష సూచించారు. నగరంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కూడా కోరారు. తిరుపతికి దేశ విదేశాల నుంచి భక్తులు కూడా వస్తుంటారు కనుక వ్యక్తిగతంగా పశువులు పెంపకం చేసే వారు ఇష్టం వచ్చినట్లు నగరంలోని రోడ్లపై వదిలి వేసే వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దని తిరుపతి ప్రజలకు, శ్రీవారి భక్తులకు మేయర్ భరోసా ఇచ్చారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
