రాష్ట్ర అభివృద్ధిని వైకుంఠపాళి కానీయొద్దండి
** ఇంటింటి ప్రచారంలో ఎమ్మెల్యే నాని, తుడా చైర్మన్ డాలర్స్
తిరుపతి: నవ్యాంధ్ర అభివృద్ధికి కంకణబద్దులై నిరంతరం ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి పాలన అభివృద్ధిని ప్రజలు వైకుంఠ పాళి కానియ్యకుండా 2029లో కూడా ఆదరిస్తే అభివృద్ధికి అడ్డు ఉండదని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, తుడా చైర్మన్ “డాలర్స్” దివాకర్ రెడ్డి తెలిపారు.
సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని చంద్రగిరి నియోజకవర్గంలో బుధవారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని తిరుపతి రూరల్ మంగళంలో ప్రారంభించారు. ముందుగా మంగళంలోని సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తిరుమల నగర్ పంచాయతీ తుడా క్వార్టర్స్ లో 27 లక్షల రూపాయలతో నూతనంగా వేసిన సిమెంట్ రోడ్డును ఎమ్మెల్యే పులివర్తి నాని, తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఇంటింటికి వెళ్లి ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల వివరాలతో పాటు చంద్రగిరి నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనుల వివరాలతో ముద్రించిన కరపత్రాలను ఇంటింటికి పంపిణీ చేశారు. గత అరాచక పాలనకు, ప్రస్తుత మెరుగైన పాలనకు ఉన్న తేడాలను వివరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ తమది మాటల ప్రభుత్వం కాదని…. చేతల ప్రభుత్వమని, ఏడాది పాలనలోని ప్రజలకు మార్పు చూపించామన్నారు. చంద్రబాబు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలలో అన్నిటిని అమలు చేస్తున్నామన్నారు. తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ ఏడాది కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో అనేక మార్పులను తీసుకు వచ్చామన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, యువ నాయకులు మంత్రి లోకేష్ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సుపరిపాలన సాగిస్తున్నారని కొనియాడారు. సూపర్ సిక్స్ పథకాల ద్వారా ప్రతి ఇంటికి లబ్ధి చేకూరుతోందని, ఎలాంటి దౌర్జన్యాలు, రౌడీయిజం లేకుండా ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
