ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరిస్తున్నాం
** తిరుపతి ఎమ్మెల్యే జంగాలపల్లి
తిరుపతి: ఏడాది కాలంలో నగరంలో 60 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు చేస్తున్నామని ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాసులు తెలిపారు. 33, 9వ డివిజన్ల పరిధిలోని అబ్బన్న కాలనీతో పాటు మారుతీనగర్ పరిధిలో 19.25 లక్షలతో నూతనంగా నిర్మించిన యూజిడి లైన్, సిసి డ్రైన్, సిసి రోడ్లను ఎమ్మెల్యే శ్రీనివాసులు, నగరపాలక సంస్థ కమిషనర్ నారపురెడ్డి మౌర్య, డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ, కార్పోరేటర్లు దూది కుమారి, నరసింహాచ్చారి, నరేంద్ర, సికే రేవతి, శైలజ, వరికుంట్ల నారాయణలు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏడాది కాలంగా నగరపాలక సంస్థలో పారదర్శకంగా పాలన అందిస్తున్నామని అన్నారు. గతంలో కార్పోరేషన్ పై 150కోట్ల అప్పుల భారం మోపగా, ప్రాధాన్యత క్రమంలో 75కోట్లు చెల్లించినట్లు ఆయన చెప్పారు. నగర అభివృద్ధికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి 60కోట్లతో వివిధ రకాల పనులు చేపట్టి కొన్ని పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. మిగిలిన పనులు కొనసాగుతున్నట్లు ఆయన చెప్పారు.
రానున్న వర్షాకాలంను దృష్టిలో ఉంచుకుని డ్రైయిన్లలో షిల్ట్ తీసి నీరు నిల్వకుండా చూస్తామని ఆయన తెలిపారు. కమిషనర్ మౌర్య మాట్లాడుతూ భూగర్భ డ్రైనేజీ సమస్యల ఫిర్యాదులు ఎక్కువగా ప్రజల నుంచి వస్తున్నాయని చెప్పారు. నగరంలోని మురుగునీరు తూకివాకం వెళ్ళే అవుట్ పాల్ ఏరియా రేణిగుంట ప్రాంతంలో రోడ్డు మధ్యలో కుంగిపోయిందని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యను పరిష్కరించాలని కోరామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి సుమారు 20 కోట్లతో డెమానుస్ట్రేషన్ ప్రాజెక్ట్ గా పరిష్కరించేందుకు ఆమోదం తెలిపిందన్నారు. డ్రైనేజీ కాలువలు, డ్రైన్స్, సిసి రోడ్లు, వీధి లైట్ల సమస్యలు ఎదురైతే వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఆమె చెప్పారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
