ఎవరూ లేరనే బాధ ఉండకూడదని…
** వృద్ధుల సేవలో ఆత్మతృప్తి ఉందన్న “శ్రద్ధ” ఆశ్రమ కార్యదర్శి
తిరుపతి (కరకంబాడి): సంసార జీవన గమనంలో పిల్లలు ఉండీ అన్నం దొరకని అభాగ్యులు కొందరు…. ఎవరూ దిక్కు లేకుండా వేళకు పిడికెడు బువ్వ పెట్టేవారు కరువైన మరికొందరు…. ఇలా అనేక విధాలుగా అన్నార్థులైన వృద్దులు… తమకు ఎవరూ లేరనే బాధ, ఆకలి వేదన ఉండకూడదనే మహత్తర ఆశయంతో ఓ మహిళ వృద్దాశ్రమాన్ని సత్ సంకల్పంతో నడుపుతున్నారు. ఆమె సేవాభావానికి స్పందిస్తున్న మనసున్న దాతల సహకారం ఆమెకు తోడుగా నిలిచింది. దాంతో ఆ మహిళ ఒక స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసుకుని గత కొన్ని నెలలుగా దిక్కులేని వృద్ధులకు మూడు పూటలా తృప్తికరమైన భోజనం, వసతి కల్పించి వారి సేవలోనే ఆత్మతృప్తి చెందుతున్నారు.
ఆమే ప్రస్తుతం తిరుపతి సమీపంలోని కరకంబాడీ తారకారామా నగర్ లో “శ్రద్ధ ఆశ్రమం” పేరుతో వృద్ధులకు ఆపన్న హస్తం అందిస్తున్న ఎం.విజయలక్ష్మి (ముంతాజ్ బేగం). తనకు సేవచేయడం అనే ఆశయం చిన్నప్పటి నుంచీ ఉండేదని… ఇన్నాళ్లకు ఈ రూపంలో చేయడం… అందులో కలియుగ దైవం పాదాల చెంత ఆ అదృష్టం రావడం జన్మ ధన్యంగా భావిస్తున్నట్లు విజయలక్ష్మి పేర్కొన్నారు. కాగా సమాజంలో ఎందరో మనసున్న మహారాజులు…. తమ పుట్టినరోజు, పెళ్లిరోజు, తల్లిదండ్రుల స్మృతి దినాలు సందర్భాల్లో అనవసర ఖర్చులు చేయకుండా ఇలాంటి అభాగ్య వృద్ధులకు అన్నదానం ద్వారా సేవలు చేస్తే పుణ్యం దక్కుతుందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఎవరైనా అన్నదానం చేయదలిస్తే… ఈ నెంబరులో సంప్రదించి చేయూత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఫోన్ నెంబర్.. 99484 02265 అని తెలిపారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
