బాన్సువాడ బస్‌స్టాండ్‌లో అస్తవ్యస్త పరిస్థితులు… పట్టించుకోని ఆర్టీసీ అధికారులు
బాన్సువాడ పట్టణంలోని ప్రధాన ఆర్టీసీ బస్‌స్టాండ్ వద్ద పరిస్థితులు రోజురోజుకూ అధ్వాన్నంగా మారుతున్నాయి. బస్‌స్టాండ్ అవుట్‌గేట్ వద్ద ఆటోలు, ఇతర వాహనాలు అడ్డంగా నిలబడటంతో తీవ్ర ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. బస్సులు స్టాండ్ నుంచి బయటకు రావాల్సిన మార్గంలోనే ఆటోలు నిర్లక్ష్యంగా తిరుగుతుండటంతో ప్రయాణికుల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయి.
బస్‌స్టాండ్ వద్ద ట్రాఫిక్ సిగ్నల్ ఉన్నప్పటికీ దానిని ఎవరూ పట్టించుకోని పరిస్థితి కనిపిస్తోంది. ఆటో డ్రైవర్లు సిగ్నల్‌ను లెక్కచేయకుండా ఎక్కడ పడితే అక్కడ నిలబడి ప్రయాణికులను ఎక్కించుకుంటుండటంతో ట్రాఫిక్ పూర్తిగా గందరగోళంగా మారుతోంది.
అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఇంత పెద్ద బస్‌స్టాండ్ వద్ద కనీసం ఒక సెక్యూరిటీ గార్డ్ కూడా కనిపించడంలేదు. బస్సులు బయటకు వస్తున్న సమయంలో ప్రయాణికులు రోడ్డుమీదే తిరుగుతుండటంతో ఎప్పుడైనా ప్రమాదం సంభవించే అవకాశముందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రతిరోజూ వందలాది మంది ప్రయాణికులు ఈ బస్‌స్టాండ్‌ను ఉపయోగిస్తున్నప్పటికీ పరిస్థితిని నియంత్రించేలా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి బాన్సువాడ బస్‌స్టాండ్ వద్ద ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించి, ఆటోల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
