
ప్రజలకు వేసవి ఇబ్బందులు రానీయొద్దు
** చలివేంద్రాలు, ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద నీడ ఏర్పాటు
** సమావేశంలో కమిషనర్ మౌర్య ఆదేశం
….
సాక్షిత ప్రతినిధి – తిరుపతి: వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చలివేంద్రాలు, ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద నీడ ఉండేలా ఏర్పాట్లు చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ నారపురెడ్డి మౌర్య అధికారులను ఆదేశించారు. వేసవిలో ఎండ తీవ్రత నుంచి ప్రజలకు ఉపశమనం కల్పించేందుకు చేయాల్సిన ఏర్పాట్లపై బుధవారం ఆమె మున్సిపల్ ఇంజినీరింగ్, హెల్త్ విభాగాల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కమిషనర్ మాట్లాడుతూ వేసవి కాలంలో నగరంలో అధిక ఉష్ణోగ్రతలు, వేడి తరంగాలు, వడదెబ్బ ప్రభావాన్ని తగ్గించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని తెలిపారు. నగరంలో ప్రధానమైన ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. చలివేంద్రాలలో సురక్షితమైన చల్లని త్రాగునీరు, మజ్జిగ ప్రజలకు అందుబాటులో ఉంచాలని కోరారు. శనివారానికి నగరంలోని అన్ని ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. నగరంలోని ప్రధాన కూడళ్ళలో, ట్రాఫిక్ సిగ్నల్స్, నడిచి వెళ్లే వారికి, వాహన చోదకులకు ఎండవేడిమి నుంచి ఉపశమనం కలిగేలా నీడ ఏర్పాటు చేయాలని తెలిపారు. పారిశుధ్య కార్మికులు ఉండే మస్టర్ పాయింట్లలో చల్లని త్రాగునీరు, వారికి అత్యవసరమైన సౌకర్యాలు అందుబాటులో ఉంచాలని తెలిపారు. చలివేంద్రాలు, నీడ ఏర్పాటు చేసేందుకు ఎవరైనా దాతలు వస్తే వారితో కలసి ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. వీధికుక్కలకు ఆహారం అందించే పాయింట్ల వద్ద, పక్షులకు త్రాగునీరు అందుబాటులో ఉంచాలని తెలిపారు. ఎండ వేడిమి ఎంత ఉంది, తీవ్రత తదితర విషయాలు తెలిపేందుకు, వారికి సాయం అందించేందుకు కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసి, సిబ్బందిని అందుబాటులో ఉంచాలని తెలిపారు. నగరంలో వేడి తీవ్రత పెరగకుండా ఉండేలా పచ్చదనం పెంచేలా చర్యలు చేపట్టాలన్నారు. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశమున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న తరుణంలో వేడి నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. .
- పలుచని, లేత రంగు పత్తి దుస్తులు ధరించాలి
- బయటకు వెళ్తే టోపీ / గొడుగు ఉపయోగించాలి.
- తరచుగా నీరు, ఓ.ఆర్.ఎస్, మజ్జిగ, నిమ్మరసం తీసుకోవాలి.
- పుచ్చకాయ, దోసకాయ వంటి నీటి శాతం ఎక్కువగా ఉన్న పండ్లు తినాలి
- ఉదయం / సాయంత్రం వేళల్లోనే బయట పనులు చేసుకోవాలి
- వీలైనంత వరకు నీడలో లేదా చల్లని ప్రదేశాల్లో ఉండాలి
- వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారిని ప్రత్యేకంగా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇవి చేయకూడదు….
- మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు బయటకు వెళ్లకండి
- తీవ్ర శారీరక శ్రమ చేయకండి
- వేడి నేలపై పాదరక్షలు లేకుండా నడవకండి
- అధిక చక్కెర పానీయాలు తీసుకోవడం నివారించండి.
ఈ సమావేశంలో ట్రైనీ కలెక్టర్ రఘువంశీ, అదనపు కమిషనర్ శారదా దేవి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
