
“అరైవ్ అలైవ్ ఫేజ్-3”లో భాగంగా జైపూర్‌లో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహణ…
సురక్షిత ప్రయాణం ప్రతి ఒక్కరి బాధ్యత…
-సీపీ అంబర్ కిషోర్ ఝా…
పెద్దపల్లి//రామగుండం: రోడ్డు ప్రమాదాల నివారణ, వాహనదారులు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవడం ప్రధాన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు చేపట్టిన “అరైవ్ అలైవ్ ఫేజ్-3” కార్యక్రమంలో భాగంగా జైపూర్ సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో.. దుబ్బపల్లి ఫంక్షన్ హాల్ వద్ద రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.
ఈ కార్యక్రమానికి రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా , మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ,రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన “అరైవ్ అలైవ్” కార్యక్రమం ద్వారా ప్రజల్లో రోడ్డుభద్రతపై అవగాహన పెంపొందించడం లక్ష్యమని తెలిపారు.
ప్రజా ప్రగతి ప్రణాళికలో భాగంగా ట్రాఫిక్ నియమాలపై అవగాహన సదస్సులు,కంటి వైద్య శిబిరాలు, ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమానికి హాజరైన యువకులు, కార్మికులు, విద్యార్థులు రోడ్డు భద్రతపై తెలుసుకున్న విషయాలను తమ గ్రామాలు,కాలనీలు, స్నేహితులు,కుటుంబ సభ్యులు, సహచరులకు తెలియజేసే దూతలుగా మారాలని సూచించారు.
ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటించేలా చైతన్యవంతం చేయడం సామాజిక బాధ్యతగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, హెల్మెట్ మరియు సీట్‌బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని స్పష్టం చేశారు.మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని హెచ్చరిస్తూ,వారి భవిష్యత్తు దృష్ట్యా తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.
రాత్రి సమయంలో డ్రైవింగ్ చేసేటప్పుడు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని,రోడ్డుపై నడిచే వారిని గమనిస్తూ వాహనాలు నడపాలని సూచించారు.కనీస జాగ్రత్తలు పాటిస్తే రోడ్డుప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు.ప్రతి ఒక్కరి సహకారంతో రామగుండం కమిషనరేట్‌ను ప్రమాదరహిత ప్రాంతంగా మార్చాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, జైపూర్ సీఐ నవీన్, చెన్నూర్ టౌన్ ఇన్స్పెక్టర్ బన్సీలాల్, చెన్నూర్ రూరల్ సీఐ కృష్ణ, జైపూర్ ఎస్‌ఐ రాజశేఖర్, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
