
దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయం….
రామగుండం కమిషనరేట్లో ఘనంగా బాబూ జగ్జీవన్ రామ్ 119వ. జయంతి వేడుకలు…
-పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా…
సాక్షిత పెద్దపల్లి ;భారత మాజీ ఉప ప్రధానమంత్రి బాబూ జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు రామగుండం పోలీస్ కమిషనరేట్లో ఘనంగా నిర్వహించబడ్డాయి. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా బాబూ జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలోనూ, స్వరాజ్యం వచ్చిన తర్వాత ఆధునిక భారత నిర్మాణంలోనూ ఆయన స్ఫూర్తిదాయకమైన సేవలు అందించారని అన్నారు.
గొప్ప రాజకీయవేత్తగా సామాజిక సమానత్వం కోసం జీవితాంతం పోరాడి, అనేక పదవులను చేపట్టి తనదైన ముద్ర వేశారని తెలిపారు. జగ్జీవన్ రామ్ జీవితాంతం బడుగు వర్గాల అభ్యున్నతికి కృషి చేశారని పేర్కొన్నారు.దేశ రక్షణ మంత్రిగా ఆయన వేసిన బాటలు దేశాన్ని సురక్షితంగా ఉంచాయని అన్నారు.
మనమందరం కలిసి పనిచేసి సమాజం, రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని, మహనీయుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా యూనిఫాం సేవల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ,బాబూ జగ్జీవన్ రామ్ సాయుధ దళాలకు ప్రత్యేక గౌరవం ఇచ్చి దేశ రక్షణలో అందరినీ భాగస్వాములను చేశారని పేర్కొన్నారు.
ఆయన దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని అన్నారు.ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ నాగేందర్ గౌడ్, ఆర్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
