
హైద్రాబాద్ వెంకన్న ఆలయాన్ని దర్శించిన టీటీడీ ఈవో
తిరుపతి / హైదరాబాద్: హైదరాబాద్‌లోని హిమయత్ నగర్ శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర సోమవారం సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన ఈవోకు స్థానిక ఎల్.ఏ.సీ. అధ్యక్షులు జి.శంకర్ గౌడ్, అధికారులు సాదర స్వాగతం పలికారు. ఈవోకు స్వామివారి దర్శనం అనంతరం వేద పండితులు వేదాశీర్వచనాలు చేశారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను అందించారు. ఈ సందర్భంగా ఆలయంలోని సమాచార కేంద్రం, కల్యాణ మండపం, ఎస్వీబీసీ కార్యాలయం, గెస్ట్ హౌస్‌తో పాటు ఆలయ పరిసరాలను సమగ్రంగా పరిశీలించారు. హిమయత్ నగర్, జూబ్లీ హిల్స్ ఆలయాలకు రోజువారీ, వారాంతాల్లో విచ్చేసే భక్తుల సంఖ్యపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
భక్తులకు అందిస్తున్న స్వామివారి సేవలు, వాటి ధరలు, కల్యాణ మండపాల నిర్వహణ విధానం, స్వామివారి సేవలను ఆన్లైన్ ద్వారా మరింత సులభంగా అందించే అంశాలపై సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 78 టీటీడీ కల్యాణ మండపాలు ఉండగా, అందులో 41 లీజ్ పద్ధతిలో, 37 టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహణలో ఉన్నట్లు ఇంజనీరింగ్ అధికారులు వివరించారు.
వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని భక్తులకు త్రాగునీటి సదుపాయం, సౌకర్యవంతమైన క్యూ లైన్లు, అవసరమైన అన్ని ఏర్పాట్లు కల్పించాలని ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశించారు.
ఆలయ పరిసరాలను పరిశుభ్రంగా, పవిత్రంగా ఉంచాలని సూచించారు. చివరగా శ్రీవారి సేవలో పాల్గొంటున్న సేవకులతో ఈవో మాట్లాడి, రోజువారీ సేవకుల సంఖ్య, వారి సేవా విధానం వంటి అంశాలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఈవో యు.రమేశ్, ఏఈ సెల్మా, టెంపుల్ ఇన్స్పెక్టర్లు మణికంఠ, లక్ష్మీపతి, శ్రీవారి సేవకులు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
