స్వచ్చ రామగుండం కోసం ప్రజల సహకారం అవసరం…..

Spread the love

స్వచ్చ రామగుండం కోసం ప్రజల సహకారం అవసరం…..

38వ డివిజన్‌లో విస్తృత పర్యటన… నాలా పూడికతీత, రహదారి అభివృద్ధి పనుల పరిశీలన…

– మేయర్ మహంకాళి స్వామి…

పెద్దపల్లి/ రామగుండం నగరానికి ప్రత్యేక గుర్తింపు తీసుకురావడానికి ఎమ్మెల్యే, కార్పొరేటర్లు, అధికారులు చేస్తున్న అభివృద్ధి ప్రయత్నాలకు ప్రజలు సహకారం అందించాలని మేయర్ మహంకాళి స్వామి పిలుపునిచ్చారు.

గురువారం వార్డు సందర్శనలో భాగంగా 38వ డివిజన్ మల్లిఖార్జున్ నగర్‌లో డిప్యూటీ మేయర్ పాతపెల్లి ఎల్లయ్య, స్థానిక కార్పొరేటర్ నెలకంటి రాముతో కలిసి పర్యటించారు.

ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు అందరూ భాగస్వాములై “స్వచ్చ రామగుండం” లక్ష్యంగా పనిచేయాలని అన్నారు. నగర పాలక సంస్థ కేవలం రూ.50తో ఇంటి వద్ద నుంచే చెత్త సేకరణ సౌకర్యం కల్పిస్తుండగా, కాలువల్లో, రోడ్లపై చెత్త వేయడం తగదని సూచించారు. చెత్త వల్ల దోమలు, ఈగలు పెరిగి అంటువ్యాధులు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

అవినీతి లేకుండా పారదర్శకంగా పనులు జరుగుతున్నాయని, గతంలా అనవసర ఖర్చులు లేకుండా మున్సిపల్ వాహనాలు, సిబ్బందితోనే నాలాల పూడికతీత పనులు చేపడుతున్నామని తెలిపారు.

ఈ సందర్భంగా 38వ డివిజన్ పరిధిలోని మేజర్ నాలా పూడికతీత పనులను మేయర్ పరిశీలించారు. రహదారుల ఇరువైపులా పెరిగిన పిచ్చి మొక్కలు, పొదలను తొలగించి, చెట్ల కొమ్మలను కత్తిరించడంతో రహదారి విస్తరించిందని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

అలాగే రహదారికి అడ్డంగా ఉన్న విద్యుత్ స్తంభాలు, అంగన్‌వాడీ స్థలంలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లను తరలించాలని ట్రాన్స్‌కో అధికారులకు ఆదేశించారు. పాత స్తంభాల స్థానంలో కొత్త పొడవైన స్తంభాలు ఏర్పాటు చేయాలని సూచించారు. నాలాల్లో పూడిక తొలగించేందుకు వాహనాలు దిగేందుకు ర్యాంపులు ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, నగర పాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకటస్వామి, ఎస్.ఇ.గురువీర, ఈ.ఇ. పి.వి. రామన్, డి.ఈ. అఫ్తాబ్, ఏ.ఈ.లు జమీల్, అన్వేష్, టిపిఎస్ నవీన్, సూపరింటెండెంట్ పబ్బాల శ్రీనివాస్, సానిటరీ ఇన్స్పెక్టర్ నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top