
అకాల వర్షం ప్రభావం, రోడ్లపై కూలిన చెట్లు తొలగించిన పోలీసులు…
–ప్రమాద స్థలాలను పరిశీలించిన సీపీ అంబర్ కిషోర్ ఝా….
పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: రామగుండం, రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జోన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అకాల గాలి వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో చెట్లు రోడ్లపై కూలిపోయాయి.
ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తంగా స్పందించి చెట్లను తొలగించి వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు.
పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, మంచిర్యాల డీసీపీ ఎం. భాస్కర్, ఏసీపీ ఆర్. ప్రకాష్ కలిసి మంచిర్యాల, హాజీపూర్, లక్షేట్టి పేట, దండేపల్లి మార్గాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితిని పరిశీలించారు. పోలీస్ సిబ్బంది, గ్రామస్తుల సహకారంతో రోడ్లపై పడిన చెట్లను తొలగించారు.
తదనంతరం దండేపల్లి పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన సీపీ, సిబ్బందితో సమావేశమై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తిన వెంటనే పై అధికారులకు సమాచారం అందించాలని ఆదేశించారు.
కోత్తూరు గ్రామ బస్టాప్ వద్ద గోడ కూలి ఇద్దరు మృతి చెందిన ఘటనతో పాటు గంపలపల్లి శివారు ప్రాంతంలోని సామిల్‌లో గోడ కూలి ఇద్దరు మరణించిన సంఘటన స్థలాలను సీపీ పరిశీలించారు. ప్రమాదాల కారణాలను తెలుసుకుని, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.
వాతావరణ మార్పుల సమయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ప్రజల భద్రత కోసం పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అప్రమత్తంగా పనిచేస్తోందని సీపీ అంబర్ కిషోర్ ఝా తెలిపారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
